తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి మే 31 మంగళవారం రాత్రితో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్‌పీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు మంగళవారం రాత్రి వరకు 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం ఒక్క రోజే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్ అప్‌లోడ్ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్‌లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో బోనఫైడ్ అప్‌లోడ్ నిబంధనకు బ్రేక్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది.