ఉద్యోగాల పండగ.. ఈ ఏడాది సెకాండఫ్‌లో జోరుగా నియామకాలు
నిరుద్యోగులకు శుభవార్త.. పలు కంపెనీలు మళ్లీ నియామకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఈ సంవత్సరం సెకాండఫ్‌లో ఎక్కువగా ఫ్రెషర్స్‌కే ఛాన్స్‌లు ఉండబోతున్నాయట
By అంజి Published on 22 Aug 2024 6:22 AM IST
ఉద్యోగాల పండగ.. ఈ ఏడాది సెకాండఫ్‌లో నియామకాలు
నిరుద్యోగులకు శుభవార్త.. పలు కంపెనీలు మళ్లీ నియామకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఈ సంవత్సరం సెకాండఫ్‌లో ఎక్కువగా ఫ్రెషర్స్‌కే ఛాన్స్‌లు ఉండబోతున్నాయని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ కెరీర్ జులై - డిసెంబర్ 2024 రిపోర్ట్ వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం.. కొత్తగా ఉద్యోగంలో చేరబోయే వారికే కంపెనీల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. నియామక సంస్థల్లో దాదాపు 72 శాతం పేర్కొన్నాయి. గత సంవత్సరంతో ఇదే కాలంతో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. ఉద్యోగ నియామకాల ప్రక్రియ క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా ప్రెషర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని రిపోర్ట్ వివరించింది.
కొత్తవారిని నియమించుకోవాలని అనుకోవడం ప్రోత్సాహకర సంకేతం అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను రూజ్ చెప్పారు. ఇది కంపెనీల విశ్వాస్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఉద్యోగాల్లో చేరాలనుకునే ఉన్నత విద్యావంతులకు ఇది విలువైన అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 603 కంపెనీలను సంప్రదించి, ఈ రిపోర్ట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇ-కామర్స్, స్టార్టప్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మౌలిక వసతులు, రిటైల్ సంస్థలు కొత్తవారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఫుల్-స్టాక్ డెవలపర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ సేల్స్ అసోసియేట్, యూజర్ ఇంటర్‌ఫేజ్ డిజైనర్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌లో స్కిల్స్ ఉన్న వారికి కూడా పలు సంస్థలు జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. బెంగళూరు సంస్థల్లో 74%, ముంబైలో 60%, చెన్నైలో 54% సంస్థలు కొత్త వారిని నియమించుకునేందుకు ముందుకు వస్తున్నాయి.