సింగరేణిలో కొలువుల జాత‌ర.. త్వరలో ఖాళీ పోస్టుల భర్తీ

651 Posts to be Filled Soon In Singareni. సింగరేణిలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సింగరేణి.

By Medi Samrat  Published on  8 Jan 2021 3:34 PM GMT
Singareni Jobs going to fill

సింగరేణిలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ మేర‌కు సింగ‌రేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్ శుక్ర‌వారం మాట్లాడుతూ.. మార్చిలోగా 651 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. సంస్థ‌లో వివిధ విభాగాల్లో ఉన్న‌ ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు.

కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ ట్రెయినీలు, మిషన్‌ ట్రెయినీలు, మోటార్‌ మెకానిక్‌, మౌల్డర్స్‌ పోస్టులుండ‌గా.. అధికారుల స్థాయిలో పర్సనల్‌ ఆఫీసర్లు, మెయిన్‌మేంట్‌ ట్రెయినీలు, వివిధ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల పోస్టులున్నాయన్నారు. వీటితో పాటు జూనియర్‌ స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు తదితర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ఇవేకాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1,436 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం సింగరేణిలో పని చేస్తూ అర్హత ఉన్న ఉద్యోగులతో ఖాళీల‌ను భర్తీ చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దానికి అనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. ఆపరేటర్లు, ఫిట్టర్‌ ట్రెయినీలు తదితర విభాగాల్లో అర్హత ఉండి.. వేరే విభాగాల్లో పని చేస్తున్నారు. 1,436 పోస్టులు ఉండగా.. పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతామని సీఎండీ చెప్పారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సీఎండీ స్పష్టం చేశారు.


Next Story