'పవన' వేగం 2024 నాటికి ప్రభంజనమౌతుందా?
By న్యూస్‌మీటర్ తెలుగు
2019 ఎన్నికల్లో ఓడిపోయినా పవన్ ప్రజాకర్షణ పెద్దగా తగ్గలేదన్న విషయం ఇటీవల విశాఖపట్నం లాంగ్ మార్చ్ మరోసారి నిస్సందేహంగా ఋజువు చేసింది. రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ ని కకావికలం చేస్తున్న కనీవినీ ఎరుగని ఇసుక సంక్షోభం విషయంలో ఆదివారం ఆయన లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. ఆయన గొంతులో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఎన్నికల నాటి ఉత్సాహమే ఆయన గొంతులో వినిపించింది. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. పవన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఆయన పోరాట పటిమ ఏ మాత్రం తగ్గలేదన్న మాట.
ఆయన ఆరోపణలు పనికిమాలినవి అని చెప్పడం కానీ, ఆయన వ్యక్తిగత జీవితం పై ప్రశ్నలు లేవనెత్తడం లేదా ఆయన ఏదో పార్టీకి ఏజెంట్ అని చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనసేన తమను దెబ్బతీస్తుందన్న భయం అధికార పార్టీలో ఉందన్న వాదనకు బలమే చేకూరుతుంది. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికి అది చేసే రాజకీయాలు నడిచే ఈ యుగంలో ఒక పార్టీ ఇంకో పార్టీతో చేతులు కలపడం పెద్ద విషయం కాదు. కొన్ని పార్టీలు బాహాటంగా కూటమి కడతాయి. కొన్ని తెరచాటు ఒప్పందాలు చేసుకుంటాయి. అంతే తేడా!!
వైజాగ్ లాంగ్ మార్చ్ నుంచి స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే రాజకీయనాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినంత మాత్రాన ఊరకుండిపోయే వ్యక్తి కాడు. ఎన్నికల పరాజయం నిజంగా ఆయన్ని కుదిపేసిన మాట నిజం. ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు – భీమవరం, గాజువాక- లలో ఓడిపోయారన్నదీ నిజమే. ఇలాంటి ఘోర పరాజయం తరువాత తిరిగి లేచి నిలుచోవాలంటే దృఢ సంకల్పం, అంతులేని ఆశావాద దృక్పథం ఉండాలి. అది పవన్ లో పుష్కలంగా ఉంది.
నిజానికి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జగన్ ఈ గుణాల వల్లే వైకాపా నామరూపాలు లేకుండా చేయాలనుకున్న చంద్రబాబు నాయుడిని తిరిగి ఢీకొనగలిగారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీని బలహీనపరచాలనుకున్న చంద్రబాబును సవాలు చేయగలిగారు. 2019 లో చంద్రబాబు మట్టి కరిస్తే, జగన్ మళ్లీ నిలిచి, గెలిచాడు. అలాగే విపక్షం అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వంటి అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు భారీ మెజారిటీతో గెలిచి, చట్టసభలో ఏకఛ్ఛత్రాధిపత్యంగా అంతా తమ ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీకి పగ్గాలు బిగించగలడు.
దరదృష్టవశాత్తూ భారత ఎన్నికల రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా, ఒకే పార్టీకి నిరంకుశ విజయాన్ని కట్టబెట్టే దిశగా వెళ్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం వల్ల కలిగే లాభాలు ఏ స్థాయికైనా దిగజారి, ఏదైనా చేసి అధికారం దక్కించుకునేలా చేస్తున్నాయి. సభలో విపక్షమనేదే లేకుండా చేస్తున్నాయి. రాజకీయ అధికారం పార్టీలకు రాష్ట్రంలోని వనరులపై గుత్తాధిపత్యాన్ని ఇస్తున్నాయి. ఆ వనరులను అమ్ముకునేందుకు, ఇతరులకు ధారాదత్తం చేసేందుకు, కుదువ పెట్టేందుకు, కట్టబెట్టేందుకు, కాదూ కూడదంటే దానం చేసేందుకు అపరిమిత అధికారాల్ని కల్పిస్తున్నాయి. అధికార పార్టీ చట్టాలను మార్చడం, తొలగించడం, ఉల్లంఘించడం, పక్కన పెట్టేయడం వంటివి ఇష్టారాజ్యంగా చేయగలుగుతోంది. చట్ట సభలో విపక్షాన్ని బలహీనపరచేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతోంది.
చట్టసభల వెలుపల అణచివేత చర్యల ద్వారా ప్రజాస్వామ్య గళం వినిపించకుండా చేయడం జరుగుతోంది. అంతా తమ ఇష్టం అన్న అధికార పార్టీల ధోరణి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. దురదృష్ట వశాత్తూ మిగతా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ ఈ ధోరణి ప్రబలుతోంది. భారీ మెజారిటీలతో గెలిచిన ముఖ్యమంత్రుల్లో అంతా తమ ఇష్టారాజ్యమన్న వైఖరి పెరుగుతోంది. వారు విమర్శలను, నిరసనలను సహించలేకపోతున్నారు. చట్టసభల్లో బలం లేదనో, ఎన్నికల్లో ఓడిపోయారనో సాకులు చెబుతూ విపక్షాల ఆక్షేపణలను వారు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను చేపట్టారంటే అది ఖచ్చితంగా స్వాగతయోగ్యమే.
నిజానికి తెలుగు దేశం కంటే పవన్ నేతృత్వంలోని జనసేనకే వైకాపా ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం సాహసోపేత ప్రచారోద్యమాన్ని చేపట్టేందుకు జనసేనకు పుష్కలమైన అవకాశం కూడా ఉంది. 2014 నుంచి 2019 వరకూ తెదెపా ఫిరాయింపులను ప్రోత్సహించిన నేపథ్యంలో తెదేపా, వైకాపాల మధ్య మరింత ఘర్షణాత్మక వైఖరి ఉండే అవకాశాలే ఉన్న నేపథ్యంలో జనసేనకు ప్రజా సమస్యలపై పోరాడే అవకాశాలున్నాయి.
వైకాపా గత తెదెపా ప్రభుత్వం చేపట్టిన వివాదాస్పద కార్యక్రమాలను తిరగదోడేందుకు నడుం బిగించింది. ఆ పార్టీ చంద్రబాబు వ్యతిరేక పోకడలను తగ్గించుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కు ఆంధ్రప్రదేశ్ లో సానుకూలత పెరిగే అవకాశం ఉంది. తాను కేవలం కాపులకే నాయకుడిని కానని, తాను అందరి వాడినేనని నిరూపించుకుని, జనసేనను పునరుజ్జీవితం చేసి ముందుకు నడిస్తే జగన్ కు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికి వీలు పడుతుంది.
-జింకా నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్