అనుష్క శర్మ ఇండియన్ క్రికెట్ జెర్సీతో ఎందుకు దిగింది?

By Newsmeter.Network  Published on  14 Jan 2020 8:33 AM GMT
అనుష్క శర్మ ఇండియన్ క్రికెట్ జెర్సీతో ఎందుకు దిగింది?

భారత క్రికెట్ ప్రపంచపు ప్రథమ పౌరురాలు.. అంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, సినీ నటి అనుష్క శర్మ భారత క్రికెట్ జెర్సీ ధరించింది. స్టేడియంలో అడుగుపెట్టింది.. అంటే ఆమె కూడా క్రికెట్ ఆడుతుందని అనుకోకండి. ఆమె క్రికెట్ ఆడటం లేదు. క్రికెట్ స్టార్ గా నటించబోతోంది. అవును.. భారత మహిళా టీమ్ మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి బయోపిక్ లో ఆమె పాత్రనే అనుష్క ధరించబోతోంది.

చక్డా ఎక్స్ ప్రెస్ పేరిట నిర్మాణమతున్న ఈ సినిమా ట్రైలర్ షూట్ కోసం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఆమె సాయంత్రం 5 గంటలకు అడుగుపెట్టారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆమెకు బెంగాలీ స్వీట్లు, తియ్యటి పెరుగుతో స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు కూడా తీసుకొచ్చారు. ఆ తరువాత పది మంది రియల్ మహిళా క్రికెటర్లు (డూపులో, జూనియర్ ఆర్టిస్టులో కాదండోయ్). ఝులన్ గోస్వామిలతో సహా క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. ఝులన్ తో కలిసి అనుష్కా నడిచివస్తుంటే నిర్మాతలు షూట్ చేశారు. ఝులన్ ఇచ్చిన కొన్ని సూచనలను కూడా ఆమె స్వీకరించారు. ఉదయం అయిదు గంటల దాకా... అంటే ఏక బిగిన పన్నెండు గంటల పాటు షూటింగ్ కొనసాగింది. అనుష్క కూడా ఒక క్రికెటర్ల లాగా తోటి ఆటగాళ్లతో “హై ఫైవ్ లు” ఇస్తూ, హగ్ లు చేస్తూ ఆడుతూ గడిపేసింది. ఝులన్ గోస్వామి నడక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనుష్క ఆ నడకను చాలా సేపు ప్రాక్టీస్ చేసింది కూడా. ఆ షూటింగ్ తాలూకు ఫోటోలను భారత పురుష, మహిళ క్రికెటర్లకు ఆమె ట్యాగ్ చేసింది కూడా.

ప్రస్తుతం అనుష్క ఇండియన్ క్రికెటర్ జెమీమా రాడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రాడ్రిగ్స్, క్రికెటర్ పృథ్వీ షా కోచ్ ప్రశాంత్ షెట్టిల వద్ద కోచింగ్ తీసుకుంటోంది. ఎం ఐ జీ క్రికెట్ అకాడెమీలో అనుష్క ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఝులన్ గోస్వామీ తో పాటు మరో ఫేమస్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా తయారవుతోంది. ఇందులో తాప్సీ పన్ను మిథాలీ రోల్ చేయబోతోంది. సో అనుష్క ఝులన్ గా పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తోంది. ఆమె మేనరిజంలను ప్రాక్టీస్ చేస్తోంది.

Next Story
Share it