'జార్జ్ రెడ్డి' సినిమా హిట్టా.. ఫట్టా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 5:52 AM GMT
జార్జ్ రెడ్డి సినిమా హిట్టా.. ఫట్టా..?

ముఖ్యాంశాలు

  • నష్టం వచ్చిందంటున్న నిర్మాతలు
  • సినిమా భారీగా సక్సెస్ అయ్యిందంటున్న దర్శకుడు

హైదరాబాద్ : ఉస్మానియా ఉద్యమ కెరటంగా చరిత్రలో శాశ్వత కీర్తిని అర్జించిన పోరాటయోధుడిగా జార్జ్ రెడ్డి పేరు నిలచిపోయింది. కానీ నిజానికి అంతటి పోరాట పటిమను కనపరచిన జార్జ్ రెడ్డి గురించి నవతరానికి అంతగా తెలియదనే చెప్పాలి. జార్జ్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత కొంతవరకూ ఆయన గురించి చాలామందికి లోతుగా తెలుసుకునే అవకాశం కలిగినమాట వాస్తవమే. కానీ నవంబర్ 22వ తేదీన విడుదలైన ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి ఇంతవరకూ స్పష్టమైన లెక్కలేవీ అందుబాటులో లేకపోవడం ఆసక్తికరమైన అశం. దీనపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

నిర్మాతలేమో ఈ సినిమావల్ల భారీగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. చిత్ర దర్శకుడు మాత్రం పెట్టిన పెట్టుబడి పూర్తిగా నిర్మాతలకు తిరిగి వచ్చేసిందని చెబుతున్నాడు. నిజానికి ఈ సినిమాలో పెద్ద స్టార్లు ఎవరూ లేరు. కానీ విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన హైప్ నిర్మాతల పెట్టుబడిన పూర్తిగా వెనక్కి తెచ్చివడంలో సహకరించిందన్నది దర్శకుడి వాదన.

డెబ్భైయ్యవ దశకంలో ఉస్మానియా ఉద్యమ కెరటమై భాసిల్లిన జార్జ్ రెడ్డి జీవన చిత్రమే ఈ సినిమా. దీనికి సంబంధించిన ట్రైలర్లుకూడా పెద్ద ఎత్తున జనంలోకి చొచ్చుకుపోయాయి. భారీస్థాయిలోనే ఆసక్తి కనిపించింది. టాలీవుడ్ దిగ్గజం చిరంజీవిలాంటి మెగాస్టార్ కూడా ఈ ట్రైలర్ ను చూసి స్పందించడం దీనికి నిదర్శనమని దర్శకుడు అంటున్నాడు.

రిలీజ్ కు ముందు ట్రైలర్లద్వారా ఈ సినిమాకు వచ్చిన హైప్ వల్ల విడుదలైన తర్వాత ఆశించిన రీతిలో సినిమా రాణించలేకపోయిందన్నది తెలుగు సినిమా వర్గాల అభిప్రాయం. అందువల్లే కొంతమేరకు ఈ సినిమా నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని సినీరంగ నిపుణులు అంటున్నారు. దీనివల్లే సినిమా కలెక్షన్లకు సంబంధించి ఇంత వరకూ ఎలాంటి లెక్కలూ అందుబాటులోకి రాలేదన్నది వారి వాదన.

ధియేటర్ రైట్స్ కోసం ఖర్చుపెట్టిన ఐదుకోట్ల రూపాయల్లో కనీసం సగమైనా వెనక్కి తిరిగి రాలేదని నిర్మాతలు వాపోతున్నారు. రిలీజ్ తర్వాత పెద్దమొత్తంలో లాభాలు వస్తాయన్న ఆశతో నిర్మాతలు శాటిలైట్ హక్కుల్ని, డిజిటల్ హక్కుల్ని విక్రయించలేదు. దాదాపుగా ఈ సినిమా నిర్మాణానికి పది కోట్ల రూపాయలవరకూ ఖర్చుపెట్టినట్టు నిర్మాతలు చెబుతున్నారు.

దర్శకుడు జీవన్ రెడ్డి మాటలను బట్టిచూస్తే ఆశించినదానికంటే సినిమాకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని, నష్టం వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో జార్జ్ రెడ్డి నిజ జీవిత కథను సేకరించిన తర్వాత, సినిమాకు అనుగుణంగా ఉండే రీతిలోనే చిత్ర కథనాన్ని సిద్ధం చేసుకున్నానని, ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే దాన్ని తెరకెక్కించానని జీవన్ రెడ్డి అంటున్నాడు.

వాస్తవ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించకుండా పిక్షన్ ను ఎక్కువగా జొప్పించే ప్రయత్నం చేశారన్న వాదనా కొన్ని వర్గాలనుంచీ గట్టిగానే వినిపిస్తోంది. సినిమా ప్రారంభంలో సినిమాను ఆసక్తికరంగా మలచడానికి ఫిక్షన్ ను జోడించే ప్రయత్నం జరిగిందంటూ దర్శకుడు చేసిన వివరణకూడా కొంతమేరకు సమాధానపూర్వకంగానే ఉంది. ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలమయ్యిందనడానికి సమాజంలోని అనేకవర్గాలనుంచి వెల్లువెత్తిన స్పందనే నిదర్శనమని దర్శకుడు చెబుతున్నాడు.

యాభై సంవత్సరాల తర్వాత జార్జ్ రెడ్డి గురించి అన్ని సామాజిక వర్గాల్లోనూ విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. కొత్తగా వచ్చిన సినిమా ప్రభావంవల్లే చాలామంది తెలియనివాళ్లకుకూడా జార్జ్ రెడ్డి పోరాట పటిమ గురించి తెలిసిందనడంలోనూ ఎలాంటి సందేహమూ లేదు.

సినిమా విడుదలైన తర్వాత జార్జ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జ్ రెడ్డి సహచరుడిగా ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాకు మంచిమార్కులే వేశారు. నిజానికి ఇది పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అన్న అభిప్రాయాన్నికూడా ఆయన వ్యక్తం చేశారు. జార్జ్ రెడ్డి కుటుంబసభ్యులకుకూడా సినిమా బాగా నచ్చడం మరో విశేషం.

ఎవరు ఏమనుకున్నా తను అనుకున్న రీతిలోనే జార్జ్ రెడ్డి జీవిత కథను తెరకు ఎక్కించగలిగానని, ప్రేక్షకులుకూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆదరించారని, సినిమా సక్సెస్ సాధించిందని చెప్పడానికి తాను ఏమాత్రం సందేహించడంలేదని దర్శకుడు జీవన్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు.

Next Story
Share it