బ్రేకింగ్ : వాయిదా పడ్డ జేఈఈ, నీట్ పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్రం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 May 2020 9:50 AM GMTకరోనా విజృంభన కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి జనజీవనం అక్కడే స్తంభించగా.. విద్యార్థుల చదువులు, పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. మార్చి నుండి జరగాల్సిన అన్ని వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటితో పాటు ప్రవేశ పరీక్షలు సైతం నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలు ప్రకటించింది. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే.. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్... జూలై 26న ఉంటుందని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షల కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నీట్ కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరగొచ్చని.. పరీక్ష తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదని మంత్రి అన్నారు. ఇదిలావుంటే.. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్ధులకు నిర్వహించనున్న పరీక్షలకు కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటించనున్నారు.