రేపే జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

By అంజి  Published on  6 Feb 2020 10:27 AM GMT
రేపే జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ మెట్రో.. ఇప్పటికే వేల మంది ప్రయాణికులును నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా నగరవాసులు మెట్రో ఎక్కడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కూడా అనేక సేవలను అందిస్తోంది. ఇప్పటికే నాగోల్‌- రాయదుర్గ్‌, మియాపూర్‌-ఎల్బీనగర్‌ మధ్య 58 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది. కాగా మూడో కారిడార్‌ జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మధ్య మెట్రో రైలు ప్రారంభానికి ముహుర్తం ఫిక్సైంది. ట్రయల్‌రన్‌ పూర్తి చేసుకున్న ఈ మార్గానికి మెట్రో రైలు భద్రతా శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ మెట్రోమార్గాన్ని ప్రారంభించనున్నారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మధ్య 15 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో మొత్తం 72 కిలోమీటర్ల పొడవున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోనే అతిపెద్ద బస్టాండ్‌లను లింక్‌ చేస్తూ మూడో కారిడార్‌ను నిర్మించారు. ఈ కారిడార్‌తో జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే వారికి ఎంతో ఉపయోగ పడనుంది. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు కారిడార్‌గా.. హైద్రాబాద్‌ మెట్రో రికార్డ్‌ సృష్టించనుంది.

JBS to MGBS Metro

ఈ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. ఇప్పుడిదే నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లకన్నా పెద్దది. సికింద్రాబాద్‌ వైఎంసీఏ జంక్షన్‌ వద్ద గతంలో నిర్మించిన ఫైఓవర్‌ కారణంగా.. దానికి సమాంతరంగా నాగోల్‌-రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఈ రెండు నిర్మాణాల వల్ల జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను 63 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఐదు అంతస్తుల ఎత్తులో రైలు ప్రయాణం ఎంతో అనుభూతిని ఇవ్వనున్నది. మెట్రో రైలుకు టైమ్‌ టేబుల్‌ అంటూ ఏమీ లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి ఆరు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు చెప్పారు. రోజంతా 710 ట్రిప్పులు నడుస్తున్నాయని తెలిపారు. ఒక గంట వ్యవధిలోనే 50 వేల మందిని మెట్రో తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది.

JBS to MGBS Metro

మెట్రో రైలులో వస్తువులు పొగొట్టుకున్న.. బాధపడాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. పొగొట్టుకున్న వస్తువులు.. ఆయా స్టేషన్‌ మేనేజర్ల వద్ద ఉంచుతారు. 90 రోజుల్లో మెట్రో రైలు సిబ్బంది.. ఆ వస్తువులను సురక్షితంగా అందజేస్తారు. ఒక వేళ ఏదైనా వస్తువు మెట్రో స్టేషన్‌లో మరిచిపోతే వెంటనే 040-23332555కు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తే.. మెట్రో సిబ్బంది ఆ వస్తువును సేకరించి అందజేస్తారు. ఒక్క మెట్రో రైలు సగటున 24 కార్లకు సమానం. గత రెండేళ్లలోనే మెట్రో రైళ్లో 9 కోట్ల మందికి పైగా ప్రయాణించారు. మెట్రో రైలు ప్రయాణాల వల్ల నగరంలో 39వేల టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ తగ్గినట్లు ఓ అధ్యాయనంలో తేలింది.

Next Story