విషాదం: 8 నెలలుగా కనిపించకుండా పోయిన జవాన్‌.. మంచులో మృతదేహం లభ్యం

By సుభాష్  Published on  16 Aug 2020 10:59 AM GMT
విషాదం: 8 నెలలుగా కనిపించకుండా పోయిన జవాన్‌.. మంచులో మృతదేహం లభ్యం

ఎనిమిది నెలలుగా కనిపించకుండాపోయిన ఓ జవాను మృతదేహం ఎట్టకేలకు మంచులో లభ్యమైంది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ మంచుకింద శనివారం ఆర్మీ అధికారులు గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చమోలి గ్రామానికి చెందిన రాజేంద్రసింగ్‌ (36) 2001లో ఆర్మీలో చేరాడు. జమ్మూలోని గర్హ్వాల్ రైఫిల్స్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గుల్మార్గ్‌ సరిహద్దులోని ఎల్‌వోసీ వద్ద విధుల్లో ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి కనిపించకుండాపోయాడు. అయితే రాజేంద్రసింగ్‌ అమరుడైనట్లు జూన్‌ 21న ఆర్మీ ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి ఓ లేఖ రాసింది. కాగా, తన భర్త మృతదేహాన్ని చూసేంత వరకు ఈ విషయాన్ని తాను అంగీకరించనని భార్య రాజేశ్వరి దేవి తెలిపింది.

కాగా, శనివారం దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ తనిఖీలు నిర్వహిస్తుండగా, భారీ మంచు కింద జవాన్‌ రాజేంద్రసింగ్‌ మృతదేహం లభించింది. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి ఆయన మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

అయితే జవాను కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన కోసం భారత ఆర్మీ తీవ్రంగా గాలించింది. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌ వైపు పడిపోయి ఉంటాడేమో అని అనునాలు వ్యక్తం చేసిన ఆర్మీ.. కొన్ని నెలల తర్వాత ఖండించింది. మంచు చరియల కింద కూరుకుపోయి మృతి చెంది ఉంటాడని భావించింది.

ఆయన భార్య నివాసం ఉంటున్న డెహ్రాడూన్‌కు రాజేంద్రసింగ్ పార్థీవ దేహాన్ని పంపిస్తామని ఆర్మీ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జవాను తల్లిదండ్రులు డెహ్రాడూన్ చేరుకున్నారు. సైనిక లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story