రస్సెల్ భార్యకు అభిమాని మెసేజ్.. 'ఆంటీ.. ప్లీజ్! దుబాయ్ వెళ్లండి..'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Oct 2020 2:45 PM GMTఆండ్రీ రసెల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గతేడాది బాగా వినిపించిన పేరు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడిన ఈ విండీస్ వీరుడు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో సైతం ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించాడు. బంతిని నిర్ధాక్షిణ్యంగానే బాదడమే లక్ష్యంగా పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. అయితే.. అదంతా గతం. ప్రస్తుత సీజన్‌లో ఈ విధ్వంసకర వీరుడు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికి బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 24 పరుగులు మాత్రమే. ఇక బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కోల్‌కత్తా ఐదు మ్యాచ్లు ఆడగా.. మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. జట్టుగా కోల్‌కత్తా రాణిస్తున్నా కూడా.. రస్సెల్ రాణించపోవడం కోల్‌కత్తా టీమ్‌మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. రస్సెల్ త్వరగా ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గంభీర్ తప్పుకున్న తరువాత ఇప్పటి వరకు కోల్‌కత్తా మరోసారి టైటిల్‌ను ముద్దాడలేదు. ఈ సారి కప్ గెలవాలంటే రస్సెల్ రాణించడం ఎంతో కీలకం.
శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా వంటి యువ క్రికెటర్లు రాణిస్తున్నా.. రస్సెల్ బ్యాట్‌ను ఝుళిపించకపోవడం పట్ల అభిమానులు కంగారు పడుతున్నారు. ఓ అభిమాని ఏకంగా ఓ అడుగు ముందుకేసి అతడి భార్యకు మెసేజ్ పంపాడు. 'జస్సిమ్ లోరా ఆంటీ.. ప్లీజ్.. మీరు వెంటనే దుబాయ్ వెళ్లండి. ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేడు 'అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. దీనికి రస్సెల్ భార్య రిప్లై ఇచ్చింది. తన భర్త ఫామ్‌లోకి వస్తాడనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. కోల్‌కత్తా ఇంకా చాలా మ్యాచ్‌లను ఆడాల్సి ఉందని.. తన భర్త తప్పక విజృంభిస్తాడని చెప్పింది. తాను దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఉందని రిప్లై కూడా ఇచ్చింది.