బరిలోకి దిగిన బుమ్రా.. ఎంట్రీ ఎప్పుడంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Dec 2019 5:42 PM ISTవెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కోలుకుంటున్నాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడట. ఈ మేరకు బుమ్రా గ్రౌండ్‌లోకి దిగాడు. అయితే.. గాయం నుంచి బుమ్రా కోలుకున్నా.. నేరుగా బౌలింగ్ చేస్తూ మైదానంలోకి దిగితేగాని మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో బుమ్రా సిద్దమయ్యాడు.
విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం విశాఖలో జరుగనున్న రెండో వన్డే కోసం టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు బంతులు సంధించి బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేయనున్నాడు. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు బౌలింగ్ చేసి తనను తాను టెస్టు చేసుకోనున్నాడు. దీనికోసం బుమ్రా జట్టుతో కలిసి విశాఖకు చేరుకున్నాడు.
ఈ విషయమై బుమ్రా బౌలింగ్ చేయడానికి సిద్ధమైన ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక్కడ ఎవరో చూడండి అన్న క్యాప్షన్ పెట్టింది. మొన్నటివరకూ బెంగళూరు క్రికెట్ శిబిరంలో శిక్షణ తీసుకున్న బుమ్రాను ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేయడానికి విశాఖకు రమ్మంటూ టీమిండియా మేనేజ్‌మెంట్ ఆదేశించింది. దీంతో బుమ్రా జట్టుతో కలిశాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలించనుంది.