భారత్‌కు జపాన్‌ రూ.3500 కోట్ల కరోనా సాయం

By సుభాష్  Published on  1 Sept 2020 2:57 PM IST
భారత్‌కు జపాన్‌ రూ.3500 కోట్ల కరోనా సాయం

కోవిడ్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జపాన్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి రూ.3500 కోట్ల సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం తరపున మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్‌ సిఎస్‌ మొహాపాత్ర, భారత్‌లోని జపాన్‌ రాయబారి సుజుకి సతోషిలు పత్రాలు మార్చుకున్నారు. ఈ నిధి కరోనాపై పోరుకోసం వినియోగించుకోనుంది భారత్‌.

కరోనా సంక్షోభం మీద పోరాడటంతో పాటు మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవడానికి ఈ నిధులను వినియోగించనుంది. అంటు వ్యాధుల మీద పోరాడటానికి భారత ఈ నిధులను వాడుకుంటుంది. ఇదే కాకుండా మరో 100 కోట్ల జపాన్‌ యెస్‌లు (సుమారు రూ.70 కోట్లు) గ్రాంటు రూపంలో అందించే పత్రాలను కూడా ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి మొహాపాత్ర, భారతలోని జపాన్‌ రాయబారి సుజుకి సతోషిలు మార్చుకున్నారు. ఈ నిధుల వల్ల కరోనాతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం కోవిడ్‌ కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. కోట్లది రూపాయలు ఖర్చు చేసి కరోనాను తరిమి కొట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది.

వైద్య వ్యవస్థను పటిష్ట పరిచే వైద్య పరికరాలు కొనుగోలు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో జపాన్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేసింది. కాగా, భారత్‌-జపాన్ ల మధ్య మంచి సంబంధాలున్నాయి. ద్వైపాక్షికాభివృద్ధి సహకారం 1958 నుంచి ఉంది. ఇలాంటి సహాయ సహకరాల వల్ల ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

Next Story