దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

By Newsmeter.Network  Published on  22 March 2020 4:45 AM GMT
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎవరూ బయటకు రాకుండా స్వీయ గృహనిర్బందంలో ఉండిపోయారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు తమ పనులు మానుకొని జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా దుకాణాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జనతా కర్ఫ్యూకు పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో రహదారులన్నీ బోసిపోయాయి.

తెలంగాణ వ్యాప్తంగా జనత కర్ఫ్యూ కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 14గంటలు కర్ఫ్యూ ఉంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ప్రజలంతా కర్ఫ్యూ కొనసాగించాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పుల్లూరు టోల్‌ గేట్‌ను మూసివేశారు. దీంతో రెండు వైపులా వాహనాలు రెండు కి.మీ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో, పట్టణాల్లో 63వేల మంది పోలీసులు, 11వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

JanataKarfu nationwide

JanataKarfu nationwide

నిజామాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి వాహనాలు రాకుండా సరిహద్దు వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల కలెక్టరేట్‌లలో ప్రత్యేక హెల్ప్‌ లైన్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరం బోసిపోయింది. జనతా కర్ఫ్యూతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ జనాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతాలు కర్ఫ్యూ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వం పారిశుద్ధ్యంపైనా దృష్టిపెట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాక, మున్సిపాలిటీల్లో శానిటేషన్‌ డ్రైవ్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సంగారెడ్డి హైవేపై పోలీసులు చెక్‌ పోస్టును మూసి వేశారు. వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. దీంతో కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

JanataKarfu nationwide

ఇదిలా ఏపీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జనత కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రజలు బయటకు రాకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునివ్వడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు.

Next Story