జ‌న‌సైనికుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తే.. ఢిల్లీ నుండి నేరుగా కాకినాడకే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jan 2020 1:22 PM GMT
జ‌న‌సైనికుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తే.. ఢిల్లీ నుండి నేరుగా కాకినాడకే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌స్తుతం డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అయితే నిన్న ప‌వ‌న్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ ఇంటిని నేడు జ‌న‌సైనికులు ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ నేఫ‌థ్యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. జ‌న‌సైనికుల‌పై రాళ్ల దాడి చేశారు. దీనిలో జ‌న‌సైనికులు కొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ విష‌య‌మై డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు.

సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి ఇలా బాధ్యత లేకుండా అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నజ‌న‌సైనికుల‌పై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే.. వారు వెనకడుగు వేస్తారనుకోవద్దని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానమ‌ని.. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని ఆయ‌న పోలీసుల‌ను కోరారు.

మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటానని తెలిపారు. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని.. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరాడు.

Next Story