ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ మద్దతు
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ నెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. బంద్ సందర్భంగా హింసకు తావులేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్మికులు శాంతియుతంగా నిరసన తెలపాలని పవన్ కల్యాణ్ కోరారు. గత రెండు వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చిందన్నారు. ఖమ్మం జిల్లాలో కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల ముందే తనను తాను తగులబెట్టుకొని చనిపోవడం, ఇప్పుడు రాణిగంజ్ డిపోకి చెందిన సురేందర్ గౌడ్ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటనలు సమ్మె తీవ్రతను తెలియజేస్తున్నాయని పవన్ అన్నారు. కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వాడి డిమాండ్లు ఎంత వరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కన పెట్టి వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.