జమ్మూకశ్మీర్‌లో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఇన్నాళ్లూ ఒక్కటిగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు గా అమల్లోకి వచ్చింది. రెండు యూనియన్ టెరిటరీల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్లు బాధ్యతలు చేపట్టారు. ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కశ్మీర్‌లో నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని మోదీ అన్నారు. అనేక రాజకీయ ఒడిదొడుకులు, మత కల్లోలాలు ఎదుర్కొన్న కశ్మీర్‌ నేటి నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. కశ్మీర్‌ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు.

అక్టోబర్‌ 31… ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి ఇదే రోజు. 500కిపైగా విడివిడిగా ఉన్న సంస్థానాలను దేశంలో విలీనం చేసిన మహానీయుడాయన. ఆ మహానాయకుడి జయంతి రోజే కశ్మీర్‌లో నవ శకానికి నాంది పలికింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లఢాఖ్ ఏర్పడ్డాయి. ఈ రెండు యూనియన్ టెరిటరీలలో కేంద్రపాలన మొదలైంది. ఈ మేరకు ఇప్పటి వరకు అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోలీసు యంత్రాంగం యావత్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుచుకుంటుంది. కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయి.

భూ లావాదేవీల వ్యవహారాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. యూటీగా మారిన కశ్మీర్‌ అసెంబ్లీకి శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్‌ ఆర్డర్‌ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీలు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పరిధిలోనే పనిచేస్తాయి.
జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీష్‌ చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. గిరీష్‌ చంద్ర చేత జమ్మూకశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ల‌డ‌ఖ్‌ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్‌గా రాధా కృష్ణ మాథుర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ గీతా మిట్టల్, మాథుర్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

లేహ్‌, కార్గిల్‌కు చెందిన అధికారులు ఆర్మీ, పారామిలిట‌రీ ద‌ళాలు, మ‌త‌పెద్దలు, సాధార‌ణ ప్రజ‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీసీ ముర్ము 1985 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. మాథూర్ 1977 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్. త్రిపురలో చీఫ్ సెక్రటరీగా పని చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లుగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తులుగా గిరీష్‌ చంద్ర, రాధాకృష్ణ నిలిచారు.

ఆగస్టు 5న మోదీ సర్కారు ఆర్టికల్-370, ఆర్టికల్-35Aలను రద్దు చేసింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి, శాశ్వత హక్కులను తొలగించింది. రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలు 107గా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చాక తర్వాత వాటి సంఖ్య 114కి పెరుగుతుంది. ఆర్టికల్‌ 370 రద్దును పాకిస్థాన్‌ అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు ప్రయత్నించింది. ఆ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించింది. కానీ ఎక్కడా మద్దతు లభించలేదు. కశ్మీర్‌ భారత్‌ అంతర్గత అంశమని అన్ని దేశాలు తేల్చి చెప్పాయి. భద్రతామండలిలో జరిగిన సంప్రదింపులు కూడా ఎటువంటి ఫలితానివ్వలేదు. ఈ పరిణామం ఇటు పాకిస్థాన్‌కు, అటు చైనాకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.