దోమలు కుడుతున్నాయ్‌.. నిద్ర పట్టడం లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 7:10 AM GMT
దోమలు కుడుతున్నాయ్‌.. నిద్ర పట్టడం లేదు

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై.. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంది నటి సంజన గల్రానీ. ఆమెకు ఆహారం, దుస్తులు అందించేందుకు సంజన తల్లిదండ్రులు గురువారం జైలు వద్దకి వెళ్లారు. అయితే.. జైలు అధికారులు దుస్తులను మాత్రమే తీసుకున్నారు. ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించారు.

కాగా.. మరో నటి రాగిణి కూడా గత నాలుగు రోజులుగా అదే జైలులో ఒంటరిగా ఉంది. సంజన వచ్చిన తరువాత ఆమెను కూడా రాగితో కలిపి ఉంచారు. ఇద్దరూ కూడా కాలక్షేపం కోసం తమతో తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ సమయం గడుపుతున్నారు. వీరిద్దరికి సాధారణ ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే అందించారు. సంజనను నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. జైలు నిబంధనల ప్రకారం.. రాగిణి, సంజనలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడేందుకు అవకాశం కల్పించడంతో.. వారు కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

తన బ్యారక్‌లో విపరీతంగా దోమలు కుడుతున్నాయని.. వాటి వల్ల తనకు నిద్ర పట్టడం లేదంటూ సంజన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. డ్రగ్స్‌ కేసులో మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సంజన పేరు లేదు. మూడు రోజుల విచారణ అనంతరం ఎ14గా నమోదు చేశారు. ఆమెను అరెస్ట్‌ చేసిన సమయంలో అయిదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు సెల్‌ఫోన్లలో సిమ్‌లు లేవు. వీటితో పాటు ప్రోమాక్స్‌ కంప్యూటర్‌, డీవీఆర్‌ వంటి వాటిని స్వాధీన పరుచుకున్నారు. కాగా.. ఇప్పటి వరకు సంజన మాదక ద్రవ్యాలను విక్రయించినట్లు, వినియోగించినట్లు ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఏ4 ప్రకాశ్‌ రాంకా అందించిన వివరాల ఆధారంగా ఆమె విచారణను కొనసాగించాలని పోలీసులు బావిస్తున్నారు. కాగా.. ఈ కేసులో మరో ఇద్దరు స్టార్‌ నటులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించే అవకాశం ఉంది.

Next Story