జగన్‌ మాటను రోశయ్య ఒప్పుకుంటారా..?

By సుభాష్
Published on : 4 March 2020 7:56 PM IST

జగన్‌ మాటను రోశయ్య ఒప్పుకుంటారా..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. జగన్ మూడుపదుల వయసున్న అప్పటికి 70 ఏళ్లుపైగా ఉన్న సీనియర్‌ నేతగా ఉన్న రోశయ్యని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. జగన్‌ ఓదార్పు యాత్రలు చేస్తున్న సమయంలో అనుమతించకుండా రోశయ్య అడ్డుకోవడాలు, ఇక రోశయ్యను జగన్‌ బాధపెడుతున్నారని ఆరోపణలు.. ఇలా 11 నెలల రోశయ్య ముఖ్యమంత్రిత్వంలో జగన్‌ ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. తర్వాత తన కోరికను నెరవేర్చుకున్న జగన్‌.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రోశయ్యని ఇంటికెళ్లి కలుసుకున్నారని ఆ మధ్యలో రోశయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అల్లుడు ఆస్తులపైన…

ఇక విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాని కోసం తెరవెనుక కూడా పెద్ద కసత్తే జరుగుతుందని తెలుస్తోంది. పరిపాలన రాజధాని కోసం విశాఖలో అనేక భవనాలను పరిశీలిస్తోంది జగన్‌ సర్కార్‌. అందులో రోశయ్య పేరు మరోమారు తెరపైకి వచ్చింది. రోశయ్య ఏకైక కుమార్తె విశాఖలో నివాసం ఉంటున్నారు. అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్‌ విశాఖలో విద్యాలయాల అధిపతిగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఆయనకు భీమిలీకి సమీపంలో మంచి సౌకర్యాలతో ఉన్న భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాలను తీసుకునేందుకు జగన్‌ సర్కార్‌ ఆలోచిస్తుట్లు టాక్‌ వినిపిస్తోంది.

అధికారుల చూపు రోశయ్య అల్లుడి భవనాల మీద..

ఇప్పుడు అధికారుల చూపు రోశయ్య అల్లుడి భవనాల మీద పడినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు నడిపారు. దీంతో పాటు సిటీకి బాగా దగ్గరలో ఉండటంతో వాటిని తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే పెద్ద ఎత్తున కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అలాగే వందల సంఖ్యలో భవనాలు కూడా అవసరం ఉంటాయి. అందుకే జగన్‌ సర్కార్‌ ఇప్పటి నుంచి భవనాలతో పాటు, ప్రభుత్వ భవనాలు కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తుండగా, అల్లుడికి ఉన్నభవనాలను తీసుకోవాలని జగన్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరీ రోశయ్య ఉద్దేశం ఎలా ఉంది

ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కన్ను రోశయ్య అల్లుడి భవనాల మీద పడటంతో అందుకు రోశయ్య సహకారం కూడా అవసరమై ఉంటుంది. పదేళ్ల క్రితం నాటి రాజకీయాలు ఎలా ఉన్నా.. రోశయ్యతో జగన్‌కు మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కాగా, రోశయ్య ద్వారా అల్లుడికి చెప్పించి భవనాలను తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోశయ్య కూడా తరచూగా విశాఖకు వస్తుంటారు. విశాఖ రాజధాని పట్ల కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తారని, ప్రభుత్వానికి రోశయ్య తరపున సహాయ, సహకారాలు కూడా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా ఈ కారణంగా రోశయ్య, జగన్‌ల బంధం మరోసారి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story