ఒక్క రోజు తేడాతో జగన్, కేసీఆర్ కీలక నిర్ణయం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 5:20 PM ISTనిష్పక్షపాతంగా ఆలోచిస్తే, మనమందరి మూలాలను గమనిస్తే...తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ కుటుంబాలు వ్యవసాయంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానం అయినవే. గత కొద్దికాలంగా రెండు రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అనేక సంక్షేమ పథకాలు తెరమీదకు వస్తున్నాయి. వ్యవసాయాన్ని అభివృద్ధి పథం వైపు నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక్క రోజు వ్యవధిలో రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
రైతుల సంక్షేమం కోణంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వారి ఉత్పత్తులను సరైన విధంగా మార్కెటింగ్ చేయడం తెలియకపోవడం వంటి అంశాలు పరిష్కరించేందుకు, రైతన్నలకు మెరుగైన ఆదాయం కోసం జగన్ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, సహకార శాఖలతో పాటుగా మొత్తం 11 శాఖల ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు గిట్టుబాటు ధర మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలు అందించనుంది.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రివర్గ సహచరులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దాని వల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో జలవిప్లవం వస్తుందన్నారు. లక్షలాది ఎకరాల బీడు భూములు.. కృష్ణా, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం(మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేత విప్లవం(పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని మంత్రి కేటీఆర్ విశ్లేషించారు. ''రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం మనకు లేదు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే.. వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. దీంతో ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నాం. ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలను పరిశీలించాం' అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా, తెలంగాణకు చెందిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడ అమలైతే రైతులకు మరింత మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఒక్క రోజు తేడాతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు అండగా నిలిచేదని విశ్లేషిస్తున్నారు.