మరో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపిన జగన్‌ సర్కార్‌

By సుభాష్  Published on  11 Dec 2019 12:29 PM GMT
మరో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపిన జగన్‌ సర్కార్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన పరంగా తనదైన వేసుకుంటున్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు మరో చరిత్రాత్మక బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలు,హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది.

ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అత్యాచారాలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే అంతే...

సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్‌ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారి కూడా అదేవిధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ శిక్షను పెంచుతూ ఈ బిల్లులో అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Next Story