ఆ పేపర్ లో అందుకే అలా రాశారు : సీఎం జగన్

By రాణి  Published on  10 Dec 2019 6:51 AM GMT
ఆ పేపర్ లో అందుకే అలా రాశారు : సీఎం జగన్

నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియకపోవడం వల్ల సాక్షి పేపర్ లో తప్పుగా రాశారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండవరోజు సమావేశంలో సన్న బియ్యంపై పెద్ద చర్చే జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేదలకు రేషన్ పై వైసీపీ ప్రభుత్వం ఇచ్చే బియ్యం నాణ్యమైనవిగా ఉండటం లేదని విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో అసలు సన్నబియ్యం అనే పేరే లేదన్నారు. ముందు తెదేపా నేతలు బియ్యం గురించి నాలెడ్జ్ పెంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైసీపీ మేనిఫెస్టోను ఆయన అసెంబ్లీలో చూపించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పామని జగన్ మరోసారి గుర్తుచేశారు.

టీడీ నేతలను పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్నారు సీఎం జగన్. సన్న బియ్యం ఇస్తామని చెప్పకుండానే మేం చెప్పామని ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీపై మండిపడ్డారు. స్వర్ణ మసూరి బియ్యం అంటే స్వర్ణ బియ్యాన్నే సన్న బియ్యం అంటారని జగన్ పేర్కొన్నారు. లావు బియ్యం ఇస్తుంటే రేషన్ తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడకపోవడంతో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మేం రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేవలం బియ్యం పంపిణీ కోసం రూ.1400 కోట్లు అదనంగా ఖర్చుచేస్తున్నట్లు జగన్ వివరించారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం ఇస్తామని, అందుకోసం స్వర్ణ రకాల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం మంచి పథకాలు ప్రవేశపెట్టి, నాణ్యమైన బియ్యం ఇస్తుంటే టీడీపీ చూసి ఓర్వలేక పోతోందని జగన్ విమర్శించారు. ఇలాంటి వారిని పిచ్చాస్పత్రిలో చేర్పిస్తే బాగుపడతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Next Story