ఆ భయం ఉంటే తప్ప వ్యవస్థలో మార్పులు రావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 12:36 PM GMT
ఆ భయం ఉంటే తప్ప వ్యవస్థలో మార్పులు రావు

అమరావతి : మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనభలో బిల్లు ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలపై అఘాయిత్యం చేసినపుడు రెడ్‌ హేండెడ్‌గా ఆధారాలు ఉంటే 21రోజుల్లో మరణ శిక్ష పడుతుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం అసెంబ్లీ సమావేశంలో మహిళలు - భద్రత పై జరిగిన స్వల్పకాలిక చర్చలు జగన్ ప్రసంగించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉండాలన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్ట్ లు పెడితే శిక్షపడుతుందనే భయం ఉండాలి. స్మార్ట్‌ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోందని, వీటన్నింటిపైనా బుధవారం అసెంబ్లీలో మరో విప్లవాత్మక బిల్లును తీసుకువస్తామని జగన్ సభాముఖంగా వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలే అయినా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన సభ్య సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన అన్నారు. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత కాల్చేసినా తప్పులేదనిపించిందన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వారిని ఎన్ కౌంటర్ చేసినందుకు తెలంగాణ పోలీసులకు, సీఎం కేసీఆర్ కు జగన్ హాట్స్ ఆఫ్ చెప్పారు. ''ఈ చట్టసభ సాక్షిగా చెప్తున్నా.. నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్లకి ఏదైనా జరిగితే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి? తప్పుచేసిన వారికి ఏరకమైన శిక్షపడితే ఉపశమనం కలుగుతుందనే ఆలోచన చేయాలి.

ఏడేళ్లు అయినా నిర్భయ దోషులకు ఇవ్వాళ్టికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే ఏదైనా చర్య జరగాలని ప్రతి చెల్లీ, ప్రతి తల్లీ ఎదురుచూస్తోంది. ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎవ్వరూ ఆశించరు కాని జరుగుతున్న జాప్యం కారణంగా, ఎలాంటి న్యాయమూ జరగదని అనిపించినప్పుడు, ఎవరినైనా కాల్చేసినా తప్పులేదన్నారు. ఇదే సినిమాల్లో హీరో ఏదైనా ఎన్‌కౌంటర్‌ చేస్తే అందరం చప్పట్టు కొడతాం. సినిమా బాగుందని చెప్తాం. కాని నిజజీవితంలో ఒక దమ్మున్నవాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవహక్కుల సంఘం పేరుతో ఢిల్లీనుంచి వస్తారు. ఇది తప్పట? ఇలా జరక్కూడదంట? ఇలా ఎందుకు చేశారంట? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పరిపాలనలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, నేరాల లెక్కలను జగన్ అసెంబ్లీలో చెప్పారు. 2014లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 13,549, 2015లో మహిళలపై నేరాల సంఖ్య 13,088, 2016లో మహిళలపై నేరాలు 13,948, 2017లో మహిళలపై నేరాలు 14,696, 2018లో మహిళలపై నేరాలు 14,048, వీటిలో వరకట్న హత్యలు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అపహరణలు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. అలాగే 2014లో జరిగిన అత్యాచారాలు 937, 2015లో 1014, 2016లో 969, 2017లో 1046, 2018లో 1096 మంది పై అత్యాచారాలు జరిగాయని వివరించారు. చిన్నారులపై జరిగిన దారుణాలు చూస్తే 2014లో 4,032 కేసులు, 2015లో 4114, 2016లో 4,477, 2017లో 4,672, 2018లో 4,215 కేసులు నమోదయ్యాయి. ఇలా పోలీసుల దృష్టికి రాని కేసులెన్నో ఉన్నాయని జగన్ తెలిపారు. బహుభార్యత్వం కలిగిన కేసులు 2014లో 216, 2015లో 264, 2016లో 240, 2017లో 262, 2018లో 195 నమోదైనట్లు పేర్కొన్నారు. ఫోక్సో యాక్ట్‌ ప్రకారం నమోదైన కేసులు చూస్తే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో అర్థం అవుతుందన్నారు. 2016లో పోక్సో యాక్ట్‌ ప్రకారం 830 కేసులు, 2017లో 1069, 2018లో 1229 కేసులు నమోదు అయ్యాయని జగన్ తెలిపారు.

ఈ ప్రభుత్వం తప్పుచేస్తోంది, శాంతిభద్రతలు లేకుండా పోయాయి అని చంద్రబాబు గారు చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు అని జగన్ చంద్రబాబుకు ధీటైన సమాధానమిచ్చారు. రాష్ర్టంలో శాంతి భద్రతలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి చంద్రబాబు ప్రయత్నించారని జగన్ దుయ్యబట్టారు.

Next Story