నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 2:14 PM GMTనల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సమావేశం రసాభాసగా మారింది. వేదికపైనే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్దం నడిచింది. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా రూ.17 వేల కోట్లను రుణమాఫీ చేశారని అన్నారు.
వెంటనే ఉత్తమ్ అభ్యంతరం చెబుతూ.. మంత్రి అన్ని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. దీనికి మంత్రి సమాధానం చెబుతూ.. రుణమాఫీ వివరాలు అసెంబ్లీలో చెప్పినప్పుడు అవి వినకుండా ప్రతి పక్ష పార్టీ నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. ‘నువ్వు పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్ పై మంత్రి జగదీష్ సెటైర్ వేశారు. వెంటనే ‘నువ్వు మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ వేశారు.