ముఖ్యాంశాలు

  • 7ఏళ్లుగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కామెడీ షో
  • జ‌డ్జిగా 7 ఏళ్లు ప్ర‌యాణం
  • ఆ వార్త‌లు నిజం కాదు

జ‌బ‌ర్థ‌స్త్.. ఓ సంచ‌ల‌నం. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో ఈ కామెడీ షో ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఎంద‌రినో బుల్లితెర‌కు ప‌రిచ‌యం చేసింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఈ షోకు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ షో ఇంత పాపుల‌ర్ అవ్వ‌డానికి నాగ‌బాబు కూడా ఓ కార‌ణం చెప్ప‌చ్చు.

అయితే… ఏమైందో ఏమో కానీ.. గ‌త కొన్ని రోజులుగా జ‌బ‌ర్థ‌స్త్ నుంచి నాగ‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై నాగ‌బాబు త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా స్పందిస్తూ… 2013 ఫిబ్ర‌వ‌రి నుంచి జబర్దస్త్ తో ప్రయాణం మొదలైంది. ఈ శుక్ర‌వారం ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ త‌న‌కు చివ‌రిది అని చెప్పారు. తనంతట తానే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు.

ప్రోగ్రామ్ బిజినెస్ కు సంబంధించిన కొన్ని భేదాభిప్రాయాల వల్ల బయటికి వచ్చేస్తున్నానని, ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు జబర్దస్త్ లోకి వచ్చానని, ఈ కార్యక్రమం కోసం తానందుకున్న పారితోషికం ఎంతో ఉపయోగపడిందన్నారు. పారితోషికం విషయంలో తేడా రావ‌డం వ‌ల‌న‌ జబర్దస్త్ నుంచి బయటికి వస్తున్నాను అని ప్ర‌చారం జ‌రుగుతుంది. అది క‌రెక్ట్ కాదు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. జ‌బ‌ర్థ‌స్త్ తో జ‌ర్నీ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఈ సంద‌ర్భంగా శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి గారికి, ఈటీవీకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.