ఏపీలో పాస్టర్లకు వేతనం.. లెక్కల్లో తేడా అంటున్న ఐవీఆర్

By సుభాష్  Published on  26 May 2020 12:41 PM GMT
ఏపీలో పాస్టర్లకు వేతనం.. లెక్కల్లో తేడా అంటున్న ఐవీఆర్

దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని పని జగన్ సర్కారు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చీల్లో పాస్టర్లకు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వడానికి సాహసించింది. ఓవైపు హిందూ దేవాలయాల నుంచి ఆదాయం తీసుకుంటూ అర్చకులను పట్టించుకోకపోవడంపై విమర్శలున్నాయి. అలాంటిది ప్రభుత్వానికి పైసా ఆదాయం తెచ్చిపెట్టని చర్చీల్లో పని చేసే పాస్టర్లకు ప్రభుత్వం వేతనాలివ్వడం ఏంటని విమర్శలు వచ్చినా జగన్ సర్కారు పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే కరోనా టైంలో కేవలం పాస్టర్లకు అని కాకుండా.. దేవాలయాల్లోని ఆర్చకులకు, మసీదుల్లో ఉండే ఇమామ్‌లకు కలిపి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం తాజాగా రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది. 33,803 మంది అర్చకులకు రూ.16.97 కోట్లు, 13,646 మంది ఇమాంలకు రూ.5.82 కోట్లు, 29,841 మంది పాస్టర్లకు రూ.14,92 కోట్లు సాయంగా అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ లెక్కల్లో తేడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్చకులు 34 వేల మంది ఉంటే.. పాస్టర్లు 30 వేల మంది ఉన్నారా అని ఆయన ఆశ్చర్యపోయారు. మన దగ్గర వీధికో గుడి ఉంటుంది. చర్చీలు కాస్త పెద్ద ఊర్లలో మాత్రం ఒక్కోటి ఉంటాయి. పట్టణాలు, నగరాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా ఏమీ చర్చీలు ఉండవు. అలాంటపుడు ఇంతమంది పాస్టర్లేంటి అన్నది ఐవీఆర్ ప్రశ్న.

ఈ విషయంలో ఆయన మరింత లోతుగా వెళ్లారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి, దానికో డిపార్ట్‌మెంట్ కూడా ఉంది కాబట్టి లెక్కలు నిర్ధారించే అవకాశం ఉందని.. కానీ మిగతా రెండు మతపరమైన సంస్థలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పని చేస్తాయని.. వాటి లెక్కలు నిర్ధిష్టంగా ఉండే అవకాశం తక్కువని ఆయనన్నారు.

అసలు మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఐవీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య గురించి మీడియాలో ప్రచారం చేయడానికి కూడా ప్రజా ధనాన్నే జగన్ సర్కారు ఉపయోగించడం విడ్డూరమని ఆయనన్నారు. దేవాలయాల నుంచి ప్రభుత్వం ఆదాయం తీసుకుంటోంది కాబట్టి వారికి సాయం అందించవచ్చు కానీ.. మిగతా మతాల వారికి ఆయా మత సంస్థల నుంచే సాయం అందించేలా విధివిధినాలు రూపొందించాలని.. ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఐవీఆర్ అన్నారు.

Next Story