ఇటలీ వెళ్లాలనుకునేవారికి బంపర్ ఆఫర్
By రాణి Published on 21 Feb 2020 11:56 AM IST
ఇటలీలో స్థిరపడాలనుకునేవారికి టెవోరా నగర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో జనాభా పెరిగిపోతుండటంతో ఆయా ప్రభుత్వాలు కంగారు పడుతోంటే..ఇటలీలోని టెవోరా ప్రభుత్వం మాత్రం అక్కడికి వలస వచ్చే వారికి బంపర్ ఆఫర్లిస్తోంది. ఇందుకు కారణం..1980లో వచ్చిన భూకంపంతో ఈ నగరంలో అపారమైన ధన, ప్రాణ నష్టం కలిగింది. భూకంప ప్రభావంతో అక్కడుండేవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ కేవలం 1500 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ నగరంలో ఉన్న చాలా భవంతులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, నిర్మాణాలున్నప్పటికీ సరిపడా జనాభా లేకపోవడంతో నగరం బోసిపోయింది. ఎలాగైనా నగరం ప్రజలతో కళకళలాడుతుండాలని భావించిన అక్కడి ప్రభుత్వం పెద్దమొత్తంలో రాయితీలు ప్రకటించింది.
ప్రపంచంలో ఏ దేశం నుంచి వచ్చిన వారైనా సరే..టెవోరాలో స్థిరపడాలనుకుంటే..వారికి రెండేళ్ల పాటు అద్దెను అక్కడి ప్రభుత్వమే చెల్లిస్తుందట. అంటే అద్దె 200 యూరోలుంటే..సుమారు 50 యూరోలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నమాట. అలాగే అక్కడ ఇళ్లు కొనుక్కోవాలనుకుంటే..కొనుగోలు ధరకు కూడా రాయితీ ఇస్తుంది..ఇంటి ఆదాయపు పన్ను కట్టనవసరం లేదు కూడా. ఇందులో ఒక మెలిక ఉంది..రెండేళ్లపాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ఎంజాయ్ చేసి మళ్లీ తిరిగి సొంత ఊరికి వెళ్లిపోతామంటే మాత్రం కుదరదట. అక్కడ ఉండాలనుకునేవారు ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. కనీసం మూడేళ్లపాటు అక్కడే ఉండి..తమ పిల్లలను కూడా టెవోరాలోని పాఠశాలల్లోనే చదివిస్తామని ప్రభుత్వానికి హామీ ఇవ్వాల్సుంటుంది. ఎందుకంటే..నేటి చిన్నారులే రేపటి భవిష్యత్ కదా. అందుకే ఎక్కువమంది చిన్నారులున్న కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తారట. ఒక్క టెవోరానే..ఇలా ప్రజలు లేక వెలవెలబోతున్న నగరాలు ఇటలీలో చాలానే ఉన్నాయి.
మీకు ఇటలీలో స్థిరపడాలని ఉంటే..టెవోరా ప్రభుత్వం పెట్టిన కండిషన్లు మీ కుటుంబానికి ఓకే అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి.