ఆమె మ‌న‌స్త‌త్వమే ఉదాహ‌ర‌ణ.. ఐటీ ఉద్యోగులెవ‌రూ ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌ద్దు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 12:22 PM GMT
ఆమె మ‌న‌స్త‌త్వమే ఉదాహ‌ర‌ణ.. ఐటీ ఉద్యోగులెవ‌రూ ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌ద్దు.!

ముఖ్యాంశాలు

  • టీటా ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం
  • పలు సూచనలు చేసిన వక్తలు

హైద‌రాబాద్ : సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌ద్ద‌ని, ఎలాంటి స‌మ‌స్య‌నైనా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని టీటా బృందంతో పాటు ప‌లువురు వ‌క్త‌లు పిలుపునిచ్చారు. టీటా ఆధ్వ‌ర్యంలో నేడు హైద‌రాబాద్‌లో 16 పాయింట్ల‌ ఎజెండాతో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి పొగాకు హ‌రిణి ఆత్మ‌శాంతికి నివాళులు అర్పించి స‌మావేశం ప్రారంభించారు.

అనంత‌రం ''ఆర్థిక మాంద్యం కోణంలో ఐటీ ఉద్యోగుల తొల‌గింపుపై ఎలా వ్య‌వ‌హ‌రించాలి?'' అనే అంశంపై రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన హ‌రిణి త‌న‌ అవ‌య‌వాలు దానం చేయండి అని కోరిందే త‌ప్ప పనిచేస్తున్న సంస్థ‌ను ఎక్క‌డా నిందించ‌లేదని... ఐటీ ఉద్యోగుల మ‌న‌స్త‌త్వం ఏ విధంగా ఉంటుంద‌నేందుకు ఆమె ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు ఎవ‌రూ మ‌నోదైర్యం కోల్పోవ‌ద్దని వ‌క్త‌లు కోరారు.

తాజాగా ఉద్యోగుల విష‌యంపై స్పందిస్తూ... ఇయ‌ర్ ఎండ్ అప్రైజ‌ల్ పీరియ‌డ్ కాబ‌ట్టి ఉద్యోగుల తొల‌గింపు ఇప్పుడు ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఉద్యోగుల‌ను తొల‌గించాల‌నుకొని భావించిన సంస్థ‌లు ఆ వ్య‌క్తికి 4వ రేటింగ్ ఇచ్చి ప‌ర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ అమ‌లు చేస్తారు. 45 నుంచి 60 రోజుల పాటు ఆ ఉద్యోగి సామ‌ర్థ్యం మెరుగుప‌డాల‌ని సూచించి...లేదంటే ట‌ర్మినెట్ చేస్తామని ష‌ర‌తులు విధిస్తున్నాయ‌ని... అయితే ఈ రూపంలో తొల‌గించ‌డం స‌రికాద‌ని వ‌క్త‌లు స్ప‌ష్టం చేశారు. ఈ కోణంలో తొల‌గించ‌డం వ‌ల్ల ఆత్మ‌న్యూన‌త భావం ఏర్ప‌డి డిప్రెష‌న్ వైపు వెళుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రాజెక్టుల ఒప్పందాల కార‌ణంగా ఉద్యోగుల‌ను తొల‌గించాల్సి వ‌స్తే... దాన్ని వివ‌రించాలే త‌ప్పించి ప‌ర్ఫార్మెన్స్‌ కార‌ణంగా చూపించ‌వ‌ద్ద‌ని అది కెరీర్‌ను, జీవితాన్ని ప్ర‌భావితం చేస్తోంద‌న్నారు. కార‌ణాలు ఏవైనా కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గిస్తే రెండు నెల‌ల వేత‌నం ఇవ్వ‌డం, మ‌రికొన్ని కంపెనీలు అస‌లేం జీతం ఇవ్వ‌కుండా ఇంటికి పంపిస్తున్నాయ‌ని పేర్కొంటూ... దీన్ని మార్చి 6 నెల‌ల వేత‌నం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అలాంటి ఉద్యోగుల‌కు కంపెనీల నుంచి వెళ్లిపోతున్న నేప‌థ్యంలో.. బీమా పొంద‌డం స‌మ‌స్యాత్మ‌కంగా ఉంద‌న్నారు. అందుకే, మాన‌వ‌తా దృక్ప‌థంతో వారికి ఏడాది పాటు ఆరోగ్య మ‌రియు జీవిత బీమా ఏడాది పాటైనా క‌ల్పించాల‌న్నారు.

కంపెనీలు 8 గంట‌ల ప‌ని వేళ‌లను పేర్కొంటున్న‌ప్ప‌టికీ... వారాంతాల్లో పని చేయించుకోవ‌డం, దీర్ఘకాలిక వేళ‌లు వంటివి ఆహ్వానించ‌ద‌గ్గ‌వి కాద‌న్నారు. లైంగిక వేధింపుల విష‌యంలో కంపెనీలు అంత‌ర్గ‌తంగా టీంను ఏర్పాటు చేసి ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల‌కు సైతం ప‌లు సూచ‌న‌లు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా బెల్ స్ట్ర‌క్చ‌ర్‌లో భాగంగా మిడ్ లెవెల్ స్థాయికి చేరుకునే క్ర‌మంలో త‌మ నైపుణ్యాల‌ను వృద్ధి చేసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి అని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో ఉద్యోగాలు వైపే కాకుండా... ఉద్యోగాలు క‌ల్పించే స్థాయికి ఎద‌గాల‌ని కోరారు. ఇందుకోసం నూత‌న నైపుణ్యాలు సొంతం చేసుకోవ‌డం, అవ‌కాశాల‌ను సృష్టించుకోవ‌డం చేయాల‌ని కోరారు.

రౌండ్‌టేబుల్‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో పాటుగా అధ్య‌క్ష‌త వ‌హించిన టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ... అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ఆర్థిక‌మాంధ్యంతో ఐటీ ప‌రిశ్ర‌మ సైతం ప్ర‌భావితం అవుతుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో క్యాంప‌స్ టు కార్పొరేట్ కొలువుకు వ‌చ్చిన వారు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు. అందుకే వ్య‌క్తిత్వ వికాస క్లాసులు కూడా సంస్థ‌లు భాగం చేయాల‌ని కోరారు. ఉద్యోగుల‌ తొల‌గింపు విష‌యంలో సంస్థ‌లు మాన‌వ‌తా దృక్ప‌థాన్ని అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

Next Story