ఇస్రో సిగలో మరో విజయం
By సుభాష్ Published on 7 Nov 2020 10:41 AM GMTభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిగలో మరో విజయం వచ్చి చేరింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది. కాగా, షార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ పీఎస్‌ఎల్పీ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
కాగా, అంతకు ముందు పీఎస్‌ఎల్పీ సీ -49 ప్రయోగం పది నిమిషాల పాటు వాయిదా పడింది. రాకెట్ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, భారీ వర్షం కారణంగా ఆలస్యమైంది. మొదటగా 3.02 నిమిషాలకు ప్రయోగించాల్సి ఉండగా, పది నిమిషాల ఆలస్యంతో 3.12కు ప్రయోగించారు. మొదట ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కాని కరోనా కారణంగా లాక్‌డౌన్ ఉండటంతో వాయిదా పడింది. కరోనా ప్రభావంతో ఈ సంవత్సరం ఇస్రో ఇప్పటి వరకు ఒక్క ప్రయోగం కూడా చేపట్టలేదు.