మన వ్యోమగాముల శిక్షణ కేంద్రం ఇక్కడే ఉండబోతోంది..!

By అంజి  Published on  6 Jan 2020 11:31 AM GMT
మన వ్యోమగాముల శిక్షణ కేంద్రం ఇక్కడే ఉండబోతోంది..!

అంతరిక్షంలోకి మనిషిని పంపించే ఇస్రో ప్రాజెక్టు ఇస్రో కేంద్ర కార్యాలయం ఉన్న బెంగుళూరులోనూ, లేక రాకెట్లను సంధించే శ్రీహరికోటలోనే లేదు. ప్రాజెక్టు ప్రధాన శిక్షణా కేంద్రం బెంగుళూర్ నుంచి పుణేకి వెళ్లే మార్గం మధ్యలో ఉన్న చల్లకెరె గ్రామంలో ఉంది. చిత్రదుర్గ జిల్లాకు చెందిన ఈ చిన్ని గ్రామంలో నాలుగువందల ఎకరాల భూమిలో ఈ ప్రాజకెక్టు ఏర్పాటవుతోంది. ఇక్కడే 2700 కోట్ల రూపాయల వ్యయంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ప్రాణం పోసుకోబోతోంది.

ఇక్కడే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకూ రష్యాలో ఈ శిక్షణ లభించేది. దీనికి భారీగా ఖర్చయ్యేది. ఇకపై మన దేశంలోనే ఈ ఏర్పాట్లు జరగనున్నాయి. అంతరిక్ష యాత్రీకుల అన్ని రకాల అవసరాలకు ప్రధాన కేంద్రంగా ఈ హెచ్ ఎస్ ఎఫ్ సీ ఉండబోతోంది. దీనికి కావలసిన నిధులు ఇప్పటికే గగన్ యాన్ ప్రాజెక్టుకు ఇచ్చిన పదివేల కోట్లకు అదనం. ఈ ప్రాజెక్టు రెండేళ్లలో నిర్మాణం కాబోతోందని ఇస్రో చైర్మన్, అంతరిక్ష విభాగ కార్యదర్శి కే. శివన్ చెబుతున్నారు.

ఇప్పటి వరకూ అంతరిక్ష యానానికి సంబంధించిన పని వివిధ చోట్ల జరుగుతూ ఉండేది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బెంగుళూరులోని యూ ఆర్ రావ్ సాటిలైట్ సెంటర్, బెంగుళూరులోనే ఉన్న ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏరోస్పేస్ మెడిసిన్ లలో ఈ పనులు జరిగేవి. ప్రస్తుతానికి ఢిల్లీలోని అంతరిక్ష భవన్‌లో సమన్వయం కోసం కార్యాలయం ఉంది. దీనికి గగన్ యాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హట్టన్, శాస్త్రవేత్త ఉన్ని కృషన్ లు సారథ్యం వహిస్తున్నారు.

Next Story