ముఖ్యాంశాలు

  • మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
  • కార్టోశాట్‌-3 శాటిలైట్‌ను నింగిలోకి పంపనున్న ఇస్రో
  • సరిహద్దుల్లో భద్రతను అనుక్షణం పరిశీలించనున్న కార్టోశాట్-3

చంద్రయాన్‌-2తో అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయిని అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని నవంబరు 25న ప్రయోగించనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో మంగళవారం ప్రకటించింది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3, 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.

ISRO Cartosat-3

పీఎస్ఎల్‌వీ-సీ47 ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సూర్యుని స్థిర కక్ష్యలోకి పంపుతారు. కార్టోశాట్‌-3తోపాటు అమెరికాకు చెందిన ఎన్ఎస్ఐఎల్‌ సహకారంతో రూపొందించిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలనూ ప్రయోగిస్తారు.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిటర్ పర్‌ఫెక్ట్‌గానే కక్ష్యలో కి చేరినప్పటికీ, ల్యాండర్, రోవర్‌లు మాత్రం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయాయి. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ లో ప్రాబ్లెమ్ రావడంతో విక్రమ్ ల్యాండర్‌, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కూలిపోయింది. ఇది ఇస్రో బృందానికి షాక్ కలిగించింది. ఐతే ఆ నిరుత్సాహం నుంచి శాస్త్రవేత్తలు త్వరగానే బయటపడ్డారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అందులో భాగంగా పీఎస్ఎల్వీ-సి-47 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇస్రో చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీహరికోట నుంచి ఒకే ఏడాది ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలు సైనిక ప్రయోజనం కోసం ఉద్దేశించినవి కావడం విశేషం.

గగన్‌యాన్‌ యాత్ర

ఇదిలా వుంటే భారత్‌ త్వరలో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కు సంబంధించిన ఇస్రో తన పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే భారత్‌కు చెందిన వ్యోమగాములకు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ శిక్షణ ఇస్తోంది. అంతరిక్ష నౌక వేడెక్కకుండా దోహదపడే పరికరాలు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలను అందించేందుకు రష్యా భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2022లో గగన్‌యాన్‌ యాత్రను చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాలును ఇస్రో పంపితే.. అంతరిక్షంలోకి మనుషులను పంపిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.