భారతీయులారా.. క్షమించండి.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 28 July 2020 1:36 PM GMTఇజ్రయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెత్యాన్హు పెద్దకుమారుడు యయిర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్వీట్ చేసినందుకు భారత్‌లోని హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాడు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న యయిర్ నిత్యం తండ్రి రాజకీయాలను సమర్థిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం హిందువుల ఆరాధ్య దేవత దుర్గాదేవి చిత్రంలో దేవి ముఖాన్ని ప్రముఖ న్యాయవాది లియత్ బెనారి ముఖచిత్రంతో మార్ఫింగ్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతోపాటు అటార్నీ జనరల్ అచివై మాండెబిట్ ముఖాన్ని దేవి అధిష్టించిన సింహం ముఖానికి మార్ఫింగ్ చేశాడు. దీనికి ‘దుష్టులారా మీ స్థాయి ఏంటో తెలుసుకోండి’ అన్న క్యాప్షన్ జతపరిచాడు.
బెంజిమన్ అవినీతికి పాల్పడ్డారని కోర్టులో దాఖలైన కేసులకు సంబంధించి అతని తరఫున లియత్‌బెనారి వాదిస్తోంది. అంతటì తో ఆగకుండా యయిర్ దుర్గాదేవి బహుబాహువులను పైకెత్తి అసభ్య సంజ్ఞ చేస్తున్నట్టు చూపాడు. ఈ ట్విటర్ పెద్ద దుమారాన్నే రేపింది. యయిర్ ట్వీట్‌ను నిరసిస్తూ భారతీయులు పెద్ద ఎత్తున విమర్శలు చేయగా, మరి కొందరు బహుశా తనకు హిందువుల గురించి తెలీదేమో...అని స్పందించారు.
ఇజ్రయిల్‌లో దిగజారుతున్న రాజకీయాలపై నిరసనగా వ్యంగ్యంగా ఈ మెమ్ తయారు చేసి ట్వీట్ చేశాను. అయితే ఆ సమయంలో ఈ మెమ్‌లో ఉపయోగించిన చిత్రం వల్ల భారతదేశంలోని హిందువుల అచారాలు, వారి నమ్మకాలను కించపరచినట్టవుతుందని.. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించలేక పోయాను. అయితే ఇండియాలోని నా స్నేహితుల స్పందన కామెంట్లతో నేను చేసిందేంటో నాకు తెలిసింది. వెంటనే ట్వీట్‌ను తీసేశాను. విషయం ఇంత దూరం పోతుందని నేను అనుకోకపోవడం నా పొరపాటే. అందుకే భారతీయులను క్షమాపణ కోరుతున్నాను’ అంటూ కొత్తగా మరోసారి ట్వీట్ చేశాడు.
పలు వివాదాంశాల్లో కేంద్ర బిందువుగా ఉంటున్న యయిర్ చేసిన తప్పును వెంటనే తెలుసకుని హిందువులకు క్షమాపణ కోరడం చాలా గొప్ప విషయం ఇలా స్పందించడానికి దమ్ము ఉండాలి...అంటూ కొందరు ఇజ్రెయిల్ ప్రజలు మెచ్చుకున్నా ...అదే సమయంలో మరికొందరు ఇజ్రెయిలీలు ఇది అత్యంతా బాధ్యతా రాహిత్య చర్య అంటూ తీవ్రంగా విమర్శించారు కూడా!
గతంలో కూడా ఓ స్థానిక టీవీఛానెల్‌లోని ప్రముఖ యాంకర్ న్యూస్ దానా వెస్‌పై అనుచితంగా కామెంటాడు. తను చదువుతున్నప్పుడు కూర్చొన్న స్థితి చాలా హాట్‌గా ఉందంటూ కామెంట్ చేసి మళ్ళీ క్షమాపణ అడిగినట్టు తెలుస్తోంది.
గత మేనెలలో జెరూసెలమ్ న్యాయాలయంలో ప్రధాని బెంజిమన్ అవినీతి ఆరోపణల తాలూకు కేసులపై విచారణ సాగుతోంది. బెంజిమన్‌పై మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం తదితర ఛార్జిషీట్‌లు దాఖలయ్యాయి. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని బెంజిమన్ అంటున్నారు. ఇది తనపై రాజకీయ కుట్రే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.
ప్రధాని విషయం ఎలాగున్నా.. అతని కుమారుడు యయిర్ తనను తాను నిగ్రహించుకోవాల్సి ఉంది. ట్విటర్ ఖాతా ఉందికదా అని ఏదిపడితే అది ట్వీటితే ఇలాంటి నిరసనలే ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రతిసారి క్షమాపణలు చెబుతూ పోతే ఆ క్షమాపణలకు విలువలేకుండా పోతుందని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుందన్న సత్యాన్ని యయిర్ గ్రహించాలి.