ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదు.. కిమ్‌ ఏం చేశాడంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 3:57 AM GMT
ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదు.. కిమ్‌ ఏం చేశాడంటే..?

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్‌ బారీన పడని దేశమంటూ దాదాపుగా ఏదీ లేదు. ఒక్క ఉత్తర కొరియా తప్ప. తమ దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని ఆదేశ అధ్యక్షుడు కింగ్‌ జోంగ్ ఉన్ కొద్ది రోజుల ముందు కూడా ప్రకటించాడు. అయితే.. ఆదేశం కరోనా కేసుల సమాచారం దాస్తోందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కాగా.. ఎప్పుడూ కరోనా కేసుల జాబితాలో ఉత్తర కొరియాను చేర్చలేదు.

తాజాగా ఉత్తరకొరియాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. నార్త్ కొరియాకు దక్షిణాన సరిహద్దుగా ఉన్న కైసోంగ్‌ నగరంలో అధికారికంగా మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆదేశం అధికారికంగా ప్రటించిన తొలి కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. దీనితో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. సరిహద్దులను మూసివేయమని చెప్పడమే కాకుండా కైసోంగ్‌లో కఠిన లాక్ డౌన్ విధించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన ఓ ఫిరాయింపుదారుడు జూలై 19న దేశ సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటి వచ్చాడని.. అతడికే కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని నార్త్ కొరియా మీడియా తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం సరిహద్దుల్లో అలాంటి ఘటన ఏమి జరగలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరోనా బాధితుడు క్వారంటైన్‌లో ఉండగా.. డాక్టర్లు అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు గడిచిన కొద్దిరోజుల్లో అతడు ఎక్కడెక్కడికి తిరిగాడు.? ఎవరిని కలిశాడు.? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారందరినీ కూడా క్వారంటైన్‌కు తరలించాలని కిమ్ ఆదేశించనట్లు తెలుస్తోంది.

తొలికేసు నమోదు కావడంతో అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్‌ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 976 పరీక్షలు నిర్వహించామని వారిలో ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు అధ్యక్షుడికి వివరించారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించామని పేర్కొన్నారు. తొలి కేసు నమోదైన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కొరియాకు ప్రమాదం పొంచిఉందని కిమ్‌ ఆదేశించారు.Next Story