టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ..

By Newsmeter.Network  Published on  28 Feb 2020 9:35 AM GMT
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ..

మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అన్న సామెతలా తయారైంది టీమిండియా పరిస్థితి. అసలే..తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు రెండో టెస్టు ముందుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొనగా.. తాజాగా ఫామ్‌లో ఉన్న ఫాస్టు బౌలర్‌.. ఇషాంత్ శర్మ రెండో టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో అందరూ విఫలమైనా.. బౌలింగ్‌లో ఇషాంత్ 5 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

జనవరి మొదటి వారంలో రంజీ మ్యాచ్‌ ఆడుతుండగా అతడి కాలి మడమ మలుచుకుంది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. కానీ అనూహ్యంగా అతి త్వరగా.. కోలుకున్న లంబూను ఆగమేఘాల మీద కివీస్‌కు రప్పించారు. ఇప్పుడు అదే గాయం తిరిగబెట్టిందని సమాచారం. పచ్చికతో జీవం ఉట్టిపడుతున్న హెగ్లేఓవల్‌ మైదానంలోని పిచ్‌పై విజయం సాధించాలంటే ఫామ్‌లో ఉన్న లంబూ జట్టుకు ఎంతో అవసరం.

తొలి టెస్టులో భారత్ తరఫున బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మాత్రమే నిలకడగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్.. 3.04 ఎకానమీ 68 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో బుమ్రా, షమీలను సైతం పక్కనపెట్టి మరీ ఇషాంత్ చేతికి కోహ్లీ బంతినివ్వడం కనిపించింది. కాగా.. ఇషాంత్‌ గాయం గురించి ఇప్పటికీ టీమిండియా అధికారికంగా బయటకు వెల్లడించలేదు. వీలు కుదిరితే.. ఆడించాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదే రిస్క్‌ తీసుకోవడం ప్రమాదకరమని భావించి కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ మరో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌తో సుధీర్ఘంగా సంభాషించారు. ఇషాంత్‌ స్థానంలో ఉమేష్ యాదవ్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Next Story