అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌లో ధోని పాల్గొనాలంటే.. వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. గురువారం నోయిడాలో హెచ్‌సీఎల్‌ 5 వ వార్షికోత్సవం గ్రాండ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కపిల్.. ధోని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. క్రికెట్‌లోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలో మనం గర్వించే ఆటగాళ్లను వచ్చే పదేళ్లలో చూడనున్నాం. నా దృష్టిలో ధోనీ ఇప్పటికే దేశానికి చాలా సేవలందించాడు. ఒక అభిమానిగా మాత్రం అతను టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. అయితే.. ఓ క్రికెటర్‌గా మాత్రం.. జట్టు యాజమాన్యం నిర్ణయానికే కట్టుబడి ఉంటా. మహేంద్రుడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాది పూర్తి కావొస్తోంది. అక్టోబర్‌లో మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో ఉండాలంటే ధోని వచ్చే ఐపీఎల్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడు. ఒక అభిమానిగా తను జట్టులో ఉండాలని కోరుకుంటున్నా.. కానీ కొత్త తరానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తా’ అని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమవుతున్న కీలక ఆటగాళ్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, విరాట్‌ కోహ్లీల పై కపిల్ స్పందించాడు. ఆటగాళ్లు గాయపడి తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు వారు నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు బుమ్రా పరిస్థితి కూడా అదే. వెన్నుముక గాయం నుంచి కోలుకొని తిరగివచ్చిన బుమ్రా కివీస్‌ పర్యటనలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఒక మంచి సెల్ఫ్ తో బుమ్రా తిరిగి గాడిలో పడతాడని తెలిపాడు.

భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. విరాట్‌ లాంటి ఆటగాడు తన తప్పులను సరిదిద్దుకుని త్వరగానే గాడిలో పడతాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

తొలి టెస్టులో ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను తీసుకోకపోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని.. అది జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయమని చెప్పాడు. తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన భారత్‌.. శనివారం నుంచి క్రైస్ట్‌చర్చిలో జరగనునన్న రెండో టెస్టులో రాణిస్తుందని, గతంలో బౌన్సీ పిచ్‌లైన పెర్త్, మెల్‌బోర్న్‌, డర్బన్‌ లాంటి వేదికలపై గెలవలేదా అని ప్రశ్నించారు. మహిళల జట్టు బాగా ఆడుతోందని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించినందుకు బీసీసీఐను అభినందిస్తున్నట్లు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.