ఇనుమే స్త్రీ ధనం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 9:02 AM GMTధన త్రయోదశి అనగానే మనసు బంగారం మీదకి వెళ్ళిపోతుంది. అదంతా మార్కెట్ మాయాజాలం అని తెలిసినా.. బంగారం లాంటి మహిళలు సైతం బంగారం వైపే చూస్తారు. అయితే అర తులం బంగారం నీ ఒంటి మీద ఉండటం కాదు, పావు తులం ఇనుము నీ వంటిలో ఉండాలి.. అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ కొత్త యాడ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. నిన్ను నీవు ప్రేమించుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఎవరినైనా ప్రేమించాలి అన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అందుకే నీ ప్రేమను బంగారం మీద కాదు ఆరోగ్యం మీద చూపించు. శరీరం మీద ఉన్న బంగారం ఇచ్చే విలువ కంటే.. శరీరంలో ఉండే కాస్తంత ఇనుము ఇచ్చే ఆరోగ్యమే ఎక్కువ. ఈ కాన్సెప్ట్‌పై డీఎస్‌ఎం అనే సంస్థ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 'ప్రాజెక్ట్ స్త్రీ ధన్' పేరుతో ఈ సంస్థ పౌష్టికాహారం, మహిళల ఆరోగ్యం గురించి ఈ వీడియో రూపొందించింది.
2018 లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం భారతదేశంలో 53 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకే ధనత్రయోదశి నాడు బంగారం కాదు. విలువైన ఐరన్ ఉండే పదార్థాలు కొని, తిని మహిళలు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నది ఈ వీడియో సారాంశం. ఇప్పటివరకు బంగారం దుకాణాలు ధన త్రయోదశి సందర్భంగా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయటం చూసాం. అయితే ఒక ఎన్జీవో విడుదల చేసిన ఈ వీడియో చూడటానికి అందంగా ఉండటమే కాదు మంచి సందేశాన్ని కూడా ఇవ్వడంతో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. చెల్లికి, తల్లికి, భార్యకి బంగారం కొని పెట్టడం కాదు బంగారం కంటే విలువైన ఆరోగ్యం కోసం ఆహారంలో ఇనుము ఉండేలా చూడటం మీరు వారిపై చూపించే ప్రేమకు తార్కాణం. ఎందుకంటే ఇంట్లోని మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం ముడిపడి ఉంది.