ఛాంపియన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 12:17 PM IST
ఛాంపియన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

2019 ప్రపంచ కప్‌ విజేత ఇంగ్లాండ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. మూడో వన్డేలో ఐర్లాండ్‌ భారీ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డే సౌతాంప్టన్ వేదికగా మంగళవారం జరిగింది. ముందుగా టాస్‌ గెలిచిన ఐర్లాండ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐర్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) టామ్ బాన్‌టన్‌ (58; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివర్లో పేసర్ డేవిడ్ విల్లే (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), టామ్‌ కరన్‌ (38 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యాంగ్‌కు 3, లిటిల్‌, కాంపెర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం 329 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌కు ఆ జట్టు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (128 బంతుల్లో 142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) డెలనీ (12) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. డెలనీ ఔట్ అనంతరం పాల్ స్టిర్లింగ్‌కు కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ (112 బంతుల్లో 113; 12 ఫోర్లు) జతకలిశాడు. వీరిద్దరు పోటా పోటిగా బౌండరీలు బాదారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఎంత మంది బౌలర్లను మార్చినా ఉపయోగం లేకపోయింది. శతకాలు సాధించిన కొద్దిసేపటికి జట్టు స్కోరు 264 పరుగుల పద్ద స్టెర్లింగ్‌, 279 పరుగుల వద్ద ఆండ్రూ బాల్బిర్నీ పెవిలియన్‌ చేరారు. కెవిన్‌ ఓబ్రియన్‌ (21; 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌), హ్యారీ టెక్టర్ (29; 26 బంతుల్లో 3 ఫోర్లు) ధాటిగా ఆడడంతో ఐర్లాండ్‌ 49.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఇంగ్లాండ్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

Next Story