హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఉన్న ప్రత్యేకత ఇదే..!
By సుభాష్ Published on 3 Jan 2020 3:58 PM IST
హైదరాబాద్ వచ్చిన ఎవ్వరైన సరే ఇరానీ ఛాయ్ రుచి చూడాల్సిందే. ఎందుకంటే ఇరానీ ఛాయ్‌కి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. హైదరాబాద్‌లో ఈ ఇరానీ ఛాయ్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. అసలు ఈ ఇరానీ ఛాయ్ అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది అని చెప్పాలి. వందల సంవత్సరాల క్రితం మన దేశానికి వలస వచ్చిన ఇరానీయన్ల నుండి మన దేశానికి పరిచయమైందే ఈ ఇరానీ ఛాయ్. వారు మన దేశంలోకి వచ్చాక క్రమ క్రమంగా ముంబై, పుణె హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అలా స్థిరపడడమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ స్టైల్ ఛాయ్‌ని ఇక్కడి వారికి అలవాటు చేసి క్రమక్రమంగా అదే వృత్తిగా చేపట్టి ఇరానీ కేఫ్‌లకి తెరతీశారు. ఆ తరువాత కాలంలో ఇరానీ ఛాయ్‌గా ప్రాచూర్యం పొందగలిగింది. మనకు లభించే చాలా రకాల టీలలో "ఇరానీ ఛాయ్" ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి.
ఇక ఈ ఇరానీ ఛాయ్‌కి మన హైదరాబాద్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. వేరే ప్రాంతం, రాష్ట్రం లేదా విదేశాల నుండి వచ్చే వారు తప్పక రుచి చూసేది ఇక్కడి ఇరానీ ఛాయ్. ప్రపంచ వ్యాప్తంగా అంతటి గుర్తింపు ఉందంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఒక శతాబ్ద కాలం నుండి ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఇరానీ ఛాయ్ కేఫ్‌లు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోకతప్పదు. ఇక ఈ ఇరానీ కేఫ్‌లలో మనకి స్నాక్ ఐటమ్స్ కూడా భలే రుచికరమైనవి లభిస్తాయి. ఉదాహరణకి ఇరానీ ఛాయ్‌లోకి ఎవరౌనా ఎక్కువగా ఇష్టపడేది ఉస్మానియా బిస్కట్స్ . అలాగే ఓల్డ్ సిటీలో మనకి దొరికే చాంద్ బిస్కెట్స్ కూడా చాలా పాపులర్. వీటితో పాటు సమోసా, పఫ్స్ ఇలా అనేకమైన స్నాక్ ఐటమ్స్ మనకు తక్కువ ధరలో లభిస్తాయి. అందుకే ఇక్కడ సామాన్య ప్రజానీకం ఒక కప్ ఛాయ్, బిస్కెట్‌తో వారి రోజుని ప్రారంభిస్తారు. ఈ కేఫ్‌లలోనే కాకుండా హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాలలో ఇంకా చాలా చోట్ల అద్భుతమైన ఇరానీ ఛాయ్ మనకు లభిస్తుంది. హైదరాబాద్ వచ్చిన ఈ ఛాయ్ రుచి చూడనిదే వెళ్లరు.