అయోధ్య భూమిపూజ.. తొలి ఆహ్వానం ఎవరికంటే..?
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 10:32 AM GMTకోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈకార్యక్రమానికి రావాల్సిందిగా.. బాబ్రీ మసీదు కోసం న్యాయ పోరాటం చేసిన ఇక్భాల్ అన్సారీకి ఈ రోజు తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు.
కాగా భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను.’ అని అన్సారీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో హిందువులు, ముస్లింలు శాంతిసామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు.
ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన, రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమం కోసం అయోధ్య మొత్తం అజేయమైన కోటగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకానున్నారు. అయితే, కరోనా ప్రబలుతున్న వేళ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
భూమి పూజ చేసే దగ్గర ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్‌దాస్ ఐదుగురు మాత్రమే ఉంటారని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమంలో హిందువులే కాదు, ఇతర మతాల పెద్దలు, ఇతర వర్గాలు, మతాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను కూడా ఆహ్వానించారు.