ఆమె సాహసానికి ప్రతి ‘రూపం’..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 8 Aug 2020 10:06 AM GMTకొందరంతే.. తిట్లు రాట్లు పాట్లు లెక్కచేయరు. కోపాల్ తాపాల్ శాపాల్ వస్తే రానీ అనుకుంటూ మొక్కవోని మనోధైర్యంతో ముందుకు సాగిపోతుంటారు. లక్ష్యం సుదూరం అయినా.. దుర్భేద్యంలా కనిపించినా.. ఏమాత్రం అలసిపోరు వెనుదిరగరు. వారి విజయాలే వారికి శ్రీరామరక్షగా నిలుస్తాయి. తాజాగా కర్ణాటకా హోమ్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ ఆఫీసర్ రూపా మౌద్గల్ ఈ కోవకు చెందిన వారే!
రూపా మౌద్గల్‌కు ఐపీఎస్ అధికారిగా కంటే బదిలీ ఆపీసర్‌గా పేరుంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం తనకు చాలా ఇష్టం. తమిళనాడు ఏఐడీఎంకే మాజీ అధ్యక్షురాలు శశికళకు జైల్లో అందుతున్న వీఐపీ మర్యాదల్ని బట్టబయలు చేశారు. అవినీతి బడాబాబులకు చుక్కలు చూపించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
అందుకేనేమో తన 20 ఏళ్ళ సర్వీసులు ఏకంగా 41 సార్లు బదిలీ పేపరు అందుకున్నారు. అరే ఎందుకిలా అని ఆ అధికారిని అడిగారనుకోండి.. చరిత్ర సృష్టించాలంటే ఈమాత్రం రిస్కు తప్పదు మరి అంటారామే నవ్వుతూ! నిజమే చరిత్ర కాలగర్భంలో అనామకంగా కలిసిపోవాలంటే డ్యూటీ ఒక్కటే చేస్తే చాలు. కానీ చరిత్రను తిరగ రాయాలంటే మాత్రం డ్యూటీ అంటూ గిరిగీసుకుం టే సరిపోదు. అందుకే నిజాయతీ నిర్భయత్వాలు తన సహజాభరణాలుగా ధగధగా వెలిగికపోతుంటారు రూపా మౌద్గల్.
మహిళలను లింగవివక్షతో చూసినంత కాలం, ఇలా చూస్తున్నారని మహిళలు కుమిలిపోతున్నంత కాలం వ్యవస్థలో పిసరంత మార్పును కూడా మనం ఆశించలేం. అయినా ప్రగతి పథంలో దూసుకుపోయేవారికి ఈ లింగవివక్షత అడ్డంకి కాదు కారాదు కూడా అంటూ తన మనసులో మాటగా రూప చెబుతారు. మహిళలు విధి నిర్వహణలో నిబద్ధతతో ఉంటన్నప్పుడుసమాజానికి మహిళలపై ఉన్న సాధారణ దృష్టితో వారిని చూడరాదని అంటారు.
రూపా 2000 బ్యాచీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటకకు చెందిన రూప బెంగళూర్ రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ తాజాగా కర్ణాటకా హోమ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. హోమ్ సెక్రటరీ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. రూపా తన కెరీర్ మొదట నుంచే సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. రాజకీయ నేతల, సీనియర్ ఐపీఎస్ అధికారుల కేసులు చేపట్టి ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు.
ఐపీఎస్ అధికారి కావాలనే ఆకాంక్ష
రూపా మౌద్గల్ చిన్నప్పటి నుంచి పోలీసాఫీసరు కావాలని కలలు కనేవారు. కారణం సమాజంలో అవినీతి అక్రమాలను దునుమాడాలంటే చట్టబద్దమైన పోలీసాఫీసరు ఉద్యోగమే సరి అనుకునేవారు. సివిల్ సర్వీసర్ల కుటుంబ నేపథ్యం వల్ల చిన్నప్పటి నుంచి లక్ష్య సాధన దిశగా చదవడం వల్ల రూపా అలవోకగాసివిల్స్ క్రాక్ చేయగలిగింది. ఐపీఎస్ ఇష్టంగా ఎంచుకుని శిక్షణ తీసుకునే సమయంలో సీనియర్లు ‘మీరు గుర్తుంచుకోవల్సింది మొదట మనం ఆఫీసర్లం.. ఆ తర్వాతే మహిళలం’ అంటూ చెప్పిన మాట ఇప్పటికీ తలచుకుంటారామె.
నలుగురు నడిచే దారి ఎవరికైనా సుఖంగానే ఉంటుంది. కానీ కొత్తదనం ఆశించేవారు అన్వేషించేవారు కొత్త దారులు వేసుకుంటూ వెళతారే తప్ప అందరి దారిలో వెళ్లరు అనే సత్యాన్ని రూపా చాలా సందర్భాల్లో రుజువు చేశారు. 2004లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. అలాగే 2017లో బెంగళూరు జైళ్ళశాఖలో అవినీతిని బట్టబయలు చేశారు. ఈ క్రమంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురయినా ఏమాత్రం వెరవలేదు. దైర్యంతో మున్ముందుకు సాగిపోయారు. అలాగే బెంగళూరు సెంట్రల్ జైలులో అవకతవకల్ని వెలుగులోకి తీసుకొచ్చి రాష్ట్రపతి అవార్డు సాధించారు. వీటితోపాటు తరచూ బదిలీలు రూపాకు ప్రత్యేకం. బదిలీ అయిన ప్రతిసారీ తన నోటి నుంచి వెలువడే మాట ఒక్కటే.. ‘నేను ఎప్పుడూ కదలడానికి సిద్ధంగా ఉంటాను’
మార్పు ఇంటినుంచే రావాలి
‘ స్త్రీ పురుష వివక్ష చిన్నప్పటి నుంచే మొదలవుతుంది మన దేశంలో. ఇది చాలా అమానుషం. అమ్మాయి కాస్త తిరిగితే చాలు.. ఇంటిబైట కాలుపెడితే చాలు. ఏంటిది మగరాయుళ్ళా అంటూ ఎకసెక్కెలు మొదలవుతాయి. పైగా అదేదో సనాతన సంప్రదాయమంటూ అమ్మాయిలు వంటింటో తల్లికి సాయంగా ఉండాలి. అబ్బాయిలు తండ్రితో మార్కెట్ వెళ్ళాలి’ అంటూ సూత్రీకరిస్తుంటారు.
ఎంత అన్యాయం.. ఈ ధోరణిలో కచ్చితంగా మార్పు వచ్చితీరాలని రూపా అంటారు. తప్పు చేయనపుడు అవినీతికి పాల్పడనపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. విమర్శలు సాధారణం. వాటిని మనం పట్టించుకునే స్థితిలో ఉండరాదు. ఇవాళ తిట్టిన నోళ్ళే రేపు విజయం సాధిస్తే పొగడ్డానికి వెనకాడవు. అలాంటప్పుడు ఎవరో ఏదో అంటారని కుమిలిపోవడం అర్థరహితం. మనకు మంచి అనిపించింది సత్యమనిపించింది అమలు చేసుకుంటూ వెళ్ళడమే జీవిత ధ్యేయం కావాలి. గతం, భవిష్యత్తు గురించి బెంగపడటం మానేసి వర్తమానంలో బతకాలి’ అంటూ ధైర్యవచనాలు పలికే రూపామౌద్గలి ఎందరికో స్పూర్తి!