వయసు అనేది సంఖ్య మాత్రమే.. ధోనికి ఇష్టం ఉంటే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 4:08 PM IST
వయసు అనేది సంఖ్య మాత్రమే.. ధోనికి ఇష్టం ఉంటే

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్‌ మొదలైతే దేశ ప్రజల మానసిక స్థితి మారుతుందని భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో ప్రజల్లో ఒక విధమైన భయానక, ఆందోళన వాతావరణం నెలకొందని, అయితే.. ఇలాంటి సమయంలో క్రికెట్ ప్రారంభమైతే సాంత్వన లభిస్తుందని చెప్పాడు. ఆటతో జాతి మానసిక స్థితి మారుతుందన్నాడు.

ఐపీఎల్ 13వ సీజన్‌ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతమని చెప్పిన ఈ కోల్‌కత్తా మాజీ కెప్టెన్‌ మ్యాచులు జరగడమే ముఖ్మన్నాడు. ప్రజల దృష్టి ఆటలపై పడితే.. ఇప్పుడున్న దుస్థితి మారుతుందని చెప్పాడు. క్రికెట్‌ నుంచి లభించే ఊరట యావత్ భారతావని మూడ్‌నే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపులతో దేశ మానసిక స్థితి మారుతుందని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ జరగనుంది.

భారత ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని భవిష్యత్‌పై గౌతీ స్పందించాడు. వయసు అనేది ఒక అంకె మాత్రమేనని, ఒక ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్నాడని భావిస్తే ఎప్పుడైనా ఆడొచ్చని చెప్పాడు. ధోని ఇప్పుడు బాగా ఆడగలననే నమ్మకంతో పాటు మ్యాచులు గెలిపించే శక్తి ఉందనుకుంటే ఆట కొనసాగించొచ్చని తెలిపాడడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం ధోని ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ధోని రిటైర్‌మెంట్‌పై వార్తలు వినిపించాయి. కాగా.. వాటిపై ధోని ఇంతవరకు స్పందించలేదు. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులో ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వాలని ధోని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story