నేటి నుంచే ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2020 9:33 AM IST
నేటి నుంచే ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం

క్రికెట్‌ అభిమానులకు నేటి నుంచి పండగ ప్రారంభం కాబోతోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్‌ ప్రేమికులు నిరుత్సాహానికి గురైయ్యారు. 12 సంవత్సరాలుగా అలవాటు పడ్డ వినోదం లేక అందరిలోనూ నిస్తేజం..కానీ ఈ సారికి ఇంతే అని నిట్టూర్చిన వేళ.. ఆలస్యంగా అయినా సరే ఐపీఎల్‌ ప్రారంభం కాబోతుండడంతో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

శనివారం నుంచే ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుండడంతో.. యూఏఈలో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సారి ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ఈ సారి లీగ్‌ ఎన్నో షరతుల మధ్య జరుగుతోంది. బయో బబుల్‌ బడగలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నాలుగు వారాల కిందటే.. అన్ని జట్టు యూఏఈ చేరుకుని క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాయి. అనంతరం రెండు వారాల పాటు ప్రాక్టీస్‌ చేశాయి. ఈ సారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి అసలు సిసలు వినోదాన్ని అందించేందుకు అన్ని జట్లు సిద్దం అయ్యాయి.

ఈ రోజు రాత్రి 7.30కు ఆరంభమయ్యే తొలి పోరులో డిఫెండింగ్‌ చాంఫియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్‌ రసవత్తరంగా ఆరంభం కానుంది. ఈ లీగ్‌ సజావుగా సాగాలని ప్రతి క్రీడాభిమాని కోరుకుంటున్నారు. మొత్తం 53 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేసేందుకు ఐపీఎల్‌ సిద్దమైంది. ఇప్పటి వరకు టైటిల్‌ గెలవని జట్లు.. ఈ సారి ఎలాగైనా కప్‌ సాధించాలని దృఢనిశ్చయంతో ఉండగా.. మరో సారి కప్పును ముద్దాడాలని మిగిలిన జట్లు భావిస్తున్నాయి.

దాదాపు 15 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ధోనీ, ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆడబోతున్న తొలి మ్యాచ్ ఇదే. దాంతో ధోనీ మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వస్తానని ప్రకటించాడు. దాంతో హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్. ఆరు నెలలుగా అసలు సిసలైన క్రికెట్ మజాను మిస్ అయిన ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ చాలారోజుల తర్వాత కిక్ ఇవ్వనుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం.

ఏ సీజన్‌లో ఎవరు విజేత..?

2008రాజస్థాన్ రాయల్స్
2009డెక్కన్‌ చార్జర్స్‌
2010చెన్నై సూపర్‌కింగ్స్‌
2011చెన్నై సూపర్‌కింగ్స్‌
2012కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌
2013ముంబై ఇండియన్స్‌
2014కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌
2015ముంబై ఇండియన్స్‌
2016సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
2017ముంబై ఇండియన్స్‌

2018చెన్నై సూపర్‌కింగ్స్‌
2019ముంబై ఇండియన్స్‌

Next Story