ఈ ఏడాది రైనాను ఐపీఎల్ లో చూడలేమా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sept 2020 8:36 PM ISTప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. జట్టుకు దూరమై భారత్ కు వచ్చేసిన సురేష్ రైనా తిరిగి జట్టు లోకి వస్తాడని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో సురేష్ రైనా వచ్చేది లేనట్లేనని.. తాము కూడా ఆశలు వదిలేసుకున్నామనే స్పష్టమైన సంకేతాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చేసింది.
సురేశ్ రైనా పేరును చెన్నై సూపర్ కింగ్స్ తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. రైనా పేరుతో పాటు హర్భజన్ సింగ్ పేరును అఫీషియల్ వెబ్‌సైట్లో నుంచి తొలగించారు. దీంతో ఈ సీజన్లో రైనా జట్టులోకి తిరిగి రావడం లేదని చెన్నై జట్టు తేల్చేసింది. అభిమానులు కూడా రైనా రాక విషయంలో ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుంది.
సురేష్ రైనా మొదట దుబాయ్ కు వెళ్లినప్పటికీ.. కొన్ని కారణాల వలన తిరిగి వచ్చేశాడు. చెన్నై జట్టు యాజమాన్యంతో గొడవ కారణంగానే దుబాయ్ నుండి ఉన్న పళంగా భారత్ కు వచ్చేశాడనే చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత సురేష్ రైనా మీద శ్రీనివాసన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రైనా మాత్రం గొడవలేమీ లేవని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో సురేష్ రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురవ్వగా స్వదేశానికి తిరిగొచ్చాడని తర్వాత తెలిసింది.
ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలోనూ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులు సురేష్ రైనా జట్టు లోకి రావాలని సామాజిక మాధ్యమాల్లో కోరుతూ వస్తున్నారు. కానీ సురేష్ రైనా తిరిగి జట్టు లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇక హర్భజన్ సీజన్ మొదట్లోనే ఐపీఎల్ ఆడడం లేదని ప్రకటించాడు. కొన్ని పర్సనల్ కారణాల వలన తాను ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.