అలాగైతే.. ఐపీఎల్ రద్దే..!
By తోట వంశీ కుమార్ Published on 14 March 2020 4:29 PM ISTక్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ పై కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13వ సీజన్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకవేళ ఏదైన కారణం వల్ల ఏప్రిల్ 20 వరకు మ్యాచులు మొదలవ్వకపోతే.. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లేనట్లే.
బీసీసీఐ ఇప్పుడు ఐపీఎల్ రీ షెడ్యూల్‌పై మల్లగుల్లాలు పడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీకి రాలేకపోతుండటంతో.. ఎప్పటి నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమవుతుంది..? అనేది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగా బీసీసీఐ ముందు మిగిలిపోయింది. బీసీసీఐ ఇప్పటి వరకూ అధికారికంగా తెలిపిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ రెండో వారంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై ఓసారి సమీక్షించి ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించనుంది. కానీ.. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరి ఉండటంతో ఆరోజుకి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో.. బీసీసీఐ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్‌ని ఏప్రిల్ 20లోపు ప్రారంభించలేకపోతే.. ఇక ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యంకాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో.. ఈ డైడ్‌లైన్ లోపు దేశంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయా..? అనేది సందేహమే.
'పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 20న ఐపీఎల్ ఆరంభమవుతుంది. ఐతే ఆ నిర్ణయం ఏప్రిల్ 10నే తీసుకోవాలి. ఏప్రిల్ 20లోపు టోర్నీ మొదలవ్వకపోతే.. వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లే అని ఓ ఐపీఎల్ అధికారి తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి మే 31 వరకు ఆరు వారాల సమయం ఉంది. ఎక్కువ రోజులు రెండు మ్యాచులు నిర్వహిస్తే 60 మ్యాచులకు ఆ సమయం సరిపోతుంది. ఏప్రిల్ మొదటి వారానికి కరోనా వైరస్ కట్టడిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. '
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పర్యాటక వీసాల్ని రద్దు చేయడంతో.. ఏప్రిల్ 15లోపు విదేశీ క్రికెటర్లు భారత్‌కి వచ్చే అవకాశం లేదు. దీంతో.. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం సాధ్యంకాదని బీసీసీఐకి ఇప్పటికే ఫ్రాంఛైజీలు స్పష్టం చేశాయి. ఎందుకంటే ఎక్కువ ప్రాంఛైజీలు విదేశీ స్టార్లపైనే ఆధారపడుతున్నాయి. కోచింగ్, సాంకేతిక సిబ్బందిలోనూ వారే ఉన్నారు. అందుకే విదేశీయులు లేకుంటే ఐపీఎల్ కష్టం. ఒకవేళ ఏప్రిల్ రెండో వారంలోపు కరోనా వైరస్ అదుపులోకి రాకపోతే.. ఆ వీసా రద్దు గడువుని ప్రభుత్వం మరింత పొడిగించనుంది.