వెంకట్ బల్మూరితో ఇంటర్వ్యూ: ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుండి ఎమ్మెల్సీ దాకా.. ఆయన లక్ష్యాలు ఇవే

తెలంగాణలో మొత్తం నిరుద్యోగ యువత సంఖ్య 45 లక్షలకు చేరుకుందని ఎమ్మెల్సీ వెంకట్‌ బల్మూరి అన్నారు. యువతకు ఉపాధి కల్పించే అంశాలపై దృష్టిసారిస్తానని అన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jan 2024 1:45 PM IST
MLC Venkat Balmuri, NSUI, Telangana

వెంకట్ బల్మూరితో ఇంటర్వ్యూ: ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుండి ఎమ్మెల్సీ దాకా.. ఆయన లక్ష్యాలు ఇవే

హైదరాబాద్: 31 సంవత్సరాల వెంకట్ బల్మూరి తెలంగాణ శాసన మండలిలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా నిలిచారు.

వృత్తిరీత్యా వైద్యుడైన వెంకట్ బల్మూరి.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 10 సంవత్సరాలలో చేసిన ఆందోళనలకు సంబంధించి వెంకట్ బల్మూరిపై 88 పోలీసు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, యువత సాధికారత, ఉచిత, నాణ్యమైన విద్య, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై చేయాల్సిన పోరాటం గురించి చర్చించారు.

న్యూస్‌మీటర్‌: గత 10 సంవత్సరాలుగా, మీరు విద్యార్థిగా పోరాటాలు చేశారు. ఇప్పుడు మీరు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీ ప్రాధాన్యతలు ఏమిటి?

వెంకట్ బల్మూరి: నేను అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్సీని. రాష్ట్రంలోని యువతకు ప్రాతినిధ్యం వహిస్తాను. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత గత పదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఉచిత, నాణ్యమైన విద్యపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు రావాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాది ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగ యువత సంఖ్య 45 లక్షలకు చేరుకుంది.

న్యూస్‌మీటర్‌: 45 లక్షల మంది నిరుద్యోగ యువత అంటే అది భారీ సంఖ్య.. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అంతంత మాత్రమే ఉన్నాయి. మీరు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు?

వెంకట్ బల్మూరి: అవును, నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. యువతకు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మా మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడమే మా ప్రాధాన్యత. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడంపై దృష్టి సారించింది ప్రభుత్వం. నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇతర దేశాలలో ఉద్యోగాలు పొందడానికి లేదా వారి స్వంతంగా (ఎంట్రప్రెన్యూర్‌షిప్) సంస్థలను ప్రారంభించడంలో సహాయం చేస్తాం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారి లక్ష్యాలను నెరవేర్చేలా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. వివిధ పథకాల కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. యువతకు ఉపాధి లభించే అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉన్నాం. పలు జిల్లాల్లో పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో బకాయిలు మాత్రమే పెరిగాయి. దీంతో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా యువతకు ఉపాధి కల్పించకపోవడంతో దేశవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది.

న్యూస్‌మీటర్‌: ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏ ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారు?

వెంకట్ బల్మూరి: యువతకు ఉపాధి కల్పించే చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థలపై కూడా మేము దృష్టి పెట్టాం. తయారీ పరిశ్రమలపై దృష్టి పెట్టాం. యువతకు ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యాభివృద్ధి ముఖ్యం. ఉదాహరణకు, మా అమ్మ కరీంనగర్‌కు చెందినవారు. జిల్లాలో బంగాళదుంప చిప్స్ బ్రాండ్ అమ్మకాలు చాలా ఎక్కువ. వీటిని దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ ప్రత్యేక పరిశ్రమను ప్రోత్సహిస్తే యువతకు అపార అవకాశాలు లభిస్తాయి. ఈ మార్గాలను మన ప్రభుత్వం అన్వేషిస్తోంది. పారిశ్రామిక వేత్తలు తమ యూనిట్ల ఏర్పాటు కోసం తెలంగాణ వైపు చూస్తున్నారని ఇటీవల మన ముఖ్యమంత్రి పర్యటన చూస్తే అర్థం అవుతుంది. మా దృష్టి విద్య, ఉద్యోగాలు, రైతులు, ఆసుపత్రులపై ఉంటుంది.

న్యూస్‌మీటర్‌: భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేసింది కదా.. ఆ ఆసుపత్రుల సంగతేంటి?

వెంకట్ బల్మూరి: నేను వృత్తి రీత్యా డాక్టర్. నా MBBS డిగ్రీ పూర్తి చేయడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. పేరుకు మాత్రమే ఆసుపత్రులు ఉన్నాయని మేము తెలుసుకున్నాం. మాకు ప్రతి జిల్లాలో అన్ని యంత్రాలు, డయాగ్నోస్టిక్స్, వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో పూర్తిస్థాయి ఆసుపత్రులు అవసరం. తెలంగాణలో ఇప్పుడు మిగులు వైద్యులున్నప్పటికీ వారిని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ప్రభుత్వ రంగంలో వైద్యులకు వేతనాలు సరిగా లేవు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్‌ రంగంలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ కారణంగానే ఎక్కువ మంది హైదరాబాద్‌లో, నగరం చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కువగా ఉన్నారు. గుండె శస్త్రచికిత్సలు, న్యూరాలజీ, ట్రామా, సరైన అనస్థీషియాను నిర్వహించగల మల్టీస్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడం లాంటి ఘటనలు జిల్లాల్లో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పాము కాటు చాలా సాధారణం కాబట్టి, పాము కాటు కేసులను పరిష్కరించడానికి నిపుణుల బృందం కూడా అవసరం. ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. అది సక్రమంగా పనిచేయాలి. ఒక వైద్యుడు మాత్రమే కాకుండా శిక్షణ పొందిన స్థానిక యువకుడు కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గ్రామస్థాయిలో కూడా ఉపాధి దొరుకుతుంది.

న్యూస్‌మీటర్‌: మీ 5-సంవత్సరాల MBBS డిగ్రీని పూర్తి చేయడానికి మీరు 8 సంవత్సరాలు ఎందుకు పట్టింది?

వెంకట్ బల్మూరి: తెలంగాణ కోసం విద్యార్థి దశలో ఉద్యమంలో పాల్గొన్నాను. ఇక కేసీఆర్ ప్రభుత్వం పని చేయడం లేదని గ్రహించి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆందోళనలు ప్రారంభించాను. నాపై 88 కేసులు నమోదయ్యాయి. నేను పోలీసు స్టేషన్‌లలో ఉండడానికే నాకు చాలా సమయమే పట్టింది.

న్యూస్‌మీటర్‌: ఇప్పుడు ఈ 88 కేసుల సంగతేంటి?

వెంకట్ బల్మూరి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించినవే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నాపై వ్యక్తిగత కేసులు లేవు. కేసులు 2015 నుండి 2023 వరకు ఉన్నాయి. వాటిని డీల్ చేసే లీగల్ టీమ్ ఉంది.

న్యూస్‌మీటర్‌: మీరు ఇప్పుడు నాయకుడిగా మారారు. సాధారణంగా చాలా మంది నాయకులు రెండవ స్థాయి నాయకత్వాన్ని ఒప్పుకోరు. మీరు కూడా అదే చేస్తారా లేదా రెండవ కమాండ్ లైన్‌ను సృష్టిస్తారా?

వెంకట్ బల్మూరి: నేను కూడా ఆ స్థాయి నుండే వచ్చాను. వెంకట్ బల్మూరి ఈ స్థాయికి చేరడానికి కారణం నేను ఒక్కడినే కాదు. NSUIకి చెందిన ఆఫీస్ బేరర్‌లో దాదాపు 1486 మంది నా వెనుక ఉన్నారు. NSUI ఆఫీస్ బేరర్లపై కూడా 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. NSUI సభ్యులందరూ అర్హత కలిగిన వ్యక్తులే. వారిలో చాలా మంది ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇతర నిపుణులు ఉన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నదే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ల లక్ష్యం. రాజకీయాలలో చదువుకున్న యువతను కాంగ్రెస్ కోరుకుంటుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయాలనుకునే భారతీయ జనతా పార్టీ తరహాలో మా రాజకీయాలు ఉండవు. విద్యను కార్పొరేటీకరణ చేయడాన్ని కూడా మేము ఒప్పుకోము.

న్యూస్‌మీటర్‌: ఇప్పుడు మీకు MLCగా బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర యువతకు మీ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు ఎలా ప్లాన్ చేస్తున్నారు?

వెంకట్ బల్మూరి: నేను కొన్ని రోజుల క్రితం ఎంతో ఫ్రీగా తిరిగాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. నేను చాలా నిర్మాణాత్మకంగా, వ్యవస్థీకృత పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నాను. 'యువనేత'గా నా విజయం చాలా ముఖ్యం, నేను ఇతరులకు బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాను. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, నేను నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. తెలంగాణ యువత కోసం మా పార్టీ చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి కృషి చేస్తాను.

Next Story