Interview: మోదీ వేవ్ కంటే.. రేవంత్ వేవ్ బలంగా ఉందంటున్న డాక్టర్ రంజిత్ రెడ్డి

చేవెళ్లలో మోదీ వేవ్ కంటే.. రేవంత్ వేవ్ బలంగా ఉందని డాక్టర్ రంజిత్ రెడ్డి అంటున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 March 2024 9:30 PM IST
congress, interview, ranjith reddy,

Interview: మోదీ వేవ్ కంటే.. రేవంత్ వేవ్ బలంగా ఉందంటున్న డాక్టర్ రంజిత్ రెడ్డి

డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడుగా ప్రముఖ వ్యక్తి. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డాక్టర్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కొండా విశ్వేశ్వర రెడ్డితో పోటీ పడుతున్నారు. చేవెళ్లలో మోదీ వేవ్ కంటే.. రేవంత్ వేవ్ బలంగా ఉందని రంజిత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని డాక్టర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.రామారావు.. గడ్డం రంజిత్ రెడ్డిని వెన్నుపోటుదారుడంటూ విమర్శలు గుప్పించారు. అయితే మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావును మంచి నాయకుడని డా.రంజిత్‌రెడ్డి అంటున్నారు. తాను కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడని, గత 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్‌ఎస్ ఏం చేసిందో కొట్టిపారేయలేనని చెప్పారు. చేవెళ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యం, విద్యా ప్రాజెక్టుల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి కేడర్ తనను మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుబట్టిందని తెలిపారు.

కాంగ్రెస్‌లో చేరాలనే తన నిర్ణయం గురించి, రాజకీయాల నుండి ఎందుకు విరామం తీసుకోవాలనుకుంటున్నారనే విషయాల గురించి న్యూస్ మీటర్ తో పంచుకున్నారు.

NM: చేవెళ్ల ఎంపీగా గత ఐదేళ్లలో మీరు సాధించిన విజయాలేమిటి? నియోజకవర్గానికి ఎన్ని నిధులు రాబట్టగలిగారు?

రంజిత్‌రెడ్డి: రంగా రెడ్డి జిల్లాలోని మండలాలను మహబూబ్‌నగర్‌కు మార్చడం వల్ల యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. చేవెళ్లలో నా మొదటి పని వారి మండలాన్ని తిరిగి రంగారెడ్డి జిల్లాకు మార్చడం. GO- 111ని రద్దు చేయడం మరో విజయం. నీటిపారుదల పనులు తాను సాధించిన మరో ఘనత. పనులు చేపట్టడంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాత్ర కూడా ఉంది. చాలా వరకూ జాతీయ రహదారి పనులు మంజూరయ్యాయి. ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తీ చేస్తాం.

1970 తర్వాత మొదటి సారిగా చేవెళ్ల బస్టాండ్‌ను పునరుద్ధరించారు. మేం స్టేడియం నిర్మించాం.. నా జేబులోంచి రూ. 50 లక్షలు కూడా చెల్లించాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం ఉచిత డయాగ్నస్టిక్ అంబులెన్స్ చేవెళ్ల చుట్టూ తిరుగుతుంది. నా ఆసుపత్రిలో ప్రజలకు ఉచిత చికిత్స కూడా లభిస్తుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అది ఆగకూడదు. ఆగిపోతే అవతలి వ్యక్తి వేగాన్ని అందుకోలేక పోయే అవకాశాలున్నాయి.

NM: మీరు BRS నుండి కాంగ్రెస్‌లోకి మారడానికి ఇదే కారణమా? బీజేపీ లోకి ఎందుకు వెళ్ళలేదు?

రంజిత్‌రెడ్డి: అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని నేను చెప్పినట్లు చేవెళ్లలో నేను కొనసాగించాలనుకున్న పనులను ప్రారంభించాను. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. BRS కేడర్‌ లో కూడా టెన్షన్ నెలకొంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తే ఏం ఉపయోగమన్నది బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ. ఈ రకమైన సంభాషణ ఎన్నికల్లో పోటీకి కిక్ ఇవ్వలేకపోయింది. నాకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని కేసీఆర్‌కి.. క్యాడర్ కు కూడా చెప్పాను. కానీ వారు సంతోషంగా లేరు. పల్స్ తెలుసుకోడానికి అనేక సర్వేలు జరిగాయి. ఏం చేయాలనే దానిపై ముందూ వెనుకా చర్చలు జరిగాయి. ఇప్పుడున్న అభివృద్ధి పనులు కొనసాగక తప్పదని కోర్‌ టీమ్‌ చెబుతుండడంతో ప్రజల చూపు కూడా కాంగ్రెస్‌ వైపే ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. నా ప్రత్యర్థి బీజేపీకి చెందిన కొండా విశేశ్వర్ రెడ్డి. చేవెళ్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఉంది.

NM: కొందరు నాయకులు మీపై చాలా అసంతృప్తితో ఉన్నారు.. కాంగ్రెస్ క్యాడర్ మీ కోసం పని చేస్తుందని నమ్ముతున్నారా?

రంజిత్‌రెడ్డి: నేను బీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్న సమయంలో నా నియోజకవర్గంలో ఆరోగ్యం, విద్య ప్రయోజనాలు కాంగ్రెస్‌ కార్యకర్తలకు కూడా చేరాయి. నేనెప్పుడూ మనుషుల మధ్య విబేధాలు సృష్టించలేదు. నా గెలుపు కోసం కాంగ్రెస్‌ కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు.

NM: BRS విషయంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి తప్పులు జరిగాయి?

రంజిత్‌రెడ్డి: కేసీఆర్‌ ప్రజానాయకుడు, కానీ పార్టీ వేగాన్ని అందుకోలేకపోయింది. నాయకులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగింది.

NM: రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరు హామీలను నెరవేర్చగలదని మీరు భావిస్తున్నారా?

రంజిత్‌రెడ్డి: మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలపై కూడా అనుమానం వచ్చింది. వాగ్దానాన్ని నెరవేర్చగలరో లేదోనని నేను భయపడిపోయాను. అయితే అవి అమలు చేస్తున్నారు, ఆరు హామీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇప్పుడు స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నా తొలి సంభాషణలో ఆరు హామీలను నెరవేర్చేందుకు ఆర్థికసాయం ఎలా అందుతోందో వివరించారు. హామీలకు సంబంధించి తాజాగా ఆర్థిక వనరులు లభించనప్పటికీ దీన్ని అమలు చేశారు. పథకాలకు సంబంధించిన ఆర్థిక వనరులను ఎలా నిర్వహించాలో సీఎం రేవంత్ రెడ్డికి చాలా స్పష్టత ఉంది. నాలుగు నెలలు గడుస్తున్నా.. అధికారుల నియామకం, ఉద్యోగాల భర్తీ, పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేసింది.

NM: మీరు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు, మీరు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు వారు ఎలా స్పందించారు?

రంజిత్‌రెడ్డి: నేను BRS కోసం 20 సంవత్సరాలు పనిచేశాను. గత ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను. కేసీఆర్ కుటుంబానికి నేను ఖచ్చితంగా సన్నిహితుడిని. నేను బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయనని చెప్పాను. కేసీఆర్ మంచి నాయకుడని నా నమ్మకం. రాష్ట్రానికి పార్టీ చాలానే చేసింది. పార్టీ ఎందుకు, ఎలా ఓడిపోయిందో నేటికీ చాలామంది ఆత్మపరిశీలన చేసుకోలేకపోతున్నారు.

NM: రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ఫ్యాక్టర్ మీకు సహాయం చేస్తారా?

రంజిత్‌రెడ్డి: చేవెళ్లలో 15 శాతం ముస్లింలు, 15 శాతం మాదిగలు, 13 నుంచి 14 శాతం ముదిరాజ్‌లు ఉన్నారు. ముస్లింల విషయానికి వస్తే బీజేపీకి కాకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తారు మాదిగలు, ముదిరాజ్‌ల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోతాయి. ముస్లింలకు భద్రత చాలా ముఖ్యమైనవి.. వారు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. ఓటర్ల మానసిక స్థితి, కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు, ఆరు హామీల అమలుతో సహా అనేక అంశాలు సహాయపడతాయి.

NM: మీరు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మీకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే నియోజకవర్గానికి నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి?

రంజిత్‌రెడ్డి: కేంద్ర స్థాయిలో మేము పార్టీగా పోరాడతాం. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తీసుకురావడం మొత్తం కాంగ్రెస్ చేసే పని, అందులో నేనూ భాగం. గత ఐదేళ్లలో మాదిరిగానే మున్సిపాలిటీల నుంచి స్థానికంగా ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు కృషి చేస్తాను.

Next Story