మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి

Zimbabwe says measles outbreak has killed 700 children.మీజిల్స్ వ్యాధి.. ప్ర‌స్తుతం జింబాబ్వే దేశాన్ని వ‌ణికిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2022 4:24 AM GMT
మీజిల్స్ వ్యాధి.. 700 మంది చిన్నారులు మృతి

మీజిల్స్ వ్యాధి.. ప్ర‌స్తుతం జింబాబ్వే దేశాన్ని వ‌ణికిస్తోంది. ఈ పేరు చెబితే చాలు అక్క‌డి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ వ్యాధి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 700 మంది చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా టీకాను త‌ప్పనిస‌రి చేయాల‌ని, ఇందు కోసం చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌నే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఏప్రిల్ తొలి వారంలో జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధిని గుర్తించారు. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు న‌మోదు కాగా.. 698 మంది చిన్నారులు మ‌ర‌ణించారు. సెప్టెంబ‌ర్ 1న ఒక్క రోజే 37 మంది ప్రాణాలు కోల్పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రెండు వారాల క్రితం మ‌ర‌ణాల సంఖ్య 157 ఉండ‌గా.. కేవ‌లం రోజుల వ్య‌వ‌ధిలో నాలుగు రెట్లు మ‌ర‌ణాలు పెర‌గ‌డం వ్యాధి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

మీజిల్స్ కేసులు జింబాబ్వేలో భారీగా న‌మోదు కావ‌డంతో పాటు మ‌ర‌ణాలు పెరుగుతుండ‌డంపై ఐరాస విభాగం యునిసెఫ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉన్నారు. మతపరమైన మూఢ నమ్మకాల కార‌ణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించ‌క‌పోవ‌డంతో వ్యాధి తీవ్ర‌త పెరుగుతోంది. వ్యాక్సిన్లు తీసుకోని వారే మ‌ర‌ణించిన వారిలో అధికంగా ఉన్న‌ట్లు ఆ దేశ స‌మాచార‌శాఖ మంత్రి మోనైకా ముత్స్‌వాంగా తెలిపారు.

ప్ర‌తి ఒక్క‌రికి టీకా త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెంచాల‌న్నారు. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా టీకా వేయాల‌న్నారు.

మీజిల్స్ వ్యాధి ల‌క్ష‌ణాలు..

ద‌గ్గు, తుమ్ముతో వ‌చ్చే అంటు వ్యాధుల్లో మీజిల్స్ ఒక‌టి. ద‌గ్గు, జ్వ‌రంతో పాటు చ‌ర్మంపై దుద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. పౌష్టికాహార లోపంతో బాధ‌ప‌డే చిన్నారుల్లో ఈ అంటు వ్యాధి అధికంగా వ్యాపిస్తుంటుంది.

Next Story