క్యాబేజీకి సిగరెట్‌, స్మార్ట్‌పోన్‌కు బ‌దులు రైస్ ప్యాకెట్‌

Xi'an residents in lockdown trade goods for food amid shortage.క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 8:49 AM GMT
క్యాబేజీకి సిగరెట్‌, స్మార్ట్‌పోన్‌కు బ‌దులు రైస్ ప్యాకెట్‌

క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాలో ప్ర‌స్తుతం కేసుల సంఖ్య పెరుగుతోంది. జీరో కేసులే ల‌క్ష్యంగా పెట్టుకున్న చైనా అందుకోసం క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. ఒక్క కేసు న‌మోదు అయినా చాలు ఆ ప్రాంతం మొత్తం క‌ఠిన లాక్‌డౌన్‌ను పెట్టేస్తోంది. ప్ర‌జ‌లెవ‌రీని బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. రెండు లేదా మూడు కేసులు న‌మోదు అయ్యాయ‌ని కోటీపైనా జ‌నాబా ఉన్న జియాంగ్ సిటీలో డిసెంబ‌ర్ 23 నుంచి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆహారం కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వం ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ వాస్త‌వ ప‌రిస్థితి మ‌రోలా ఉంది. చాలా మంది సాయం అంద‌డం లేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వాపోతున్నారు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లో నివ‌సించే ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రు సాయం చేసుకుంటున్నారు. న‌గ‌దు ప్రాధాన్యం త‌గ్గిపోయి.. వ‌స్తుమార్పిడి ద్వారా ఆహారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. క్యాబేజీకి సిగరెట్‌, స్మార్ట్‌పోన్‌కు బ‌దులు రైస్ ప్యాకెట్‌, యాపిల్స్‌కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్‌, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్‌, రొట్టెలకు బదులు నూడుల్స్ ఇలా వ‌స్తువుల‌ను మార్పిడి చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవ‌నం సాగిస్తున్నారు.

లాక్‌డౌన్ ఎన్నిరోజులు ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. ఇక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కూడా ఆస్ప‌త్రికి వెళ్ల‌నివ్వ‌డం లేదు. గుండెపోటు, ఇతర‌త్రా కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. కాగా.. కొందరు వయసుపైబడిన వాళ్లు పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ చెబుతున్నారు. పూర్వ‌కాలంలో డ‌బ్బులు ఉండేవి కాదు. వ‌స్తువు మార్పుడి ద్వారానే కావాల్సిన‌వి తీసుకెళ్లేవారు.

Next Story