బ‌ల‌వంతంగా స్నానం చేయించిన కొన్ని రోజుల‌కే.. ప్ర‌పంచంలోనే అత్యంత మురికి వ్య‌క్తి మృతి

World's dirtiest man dies in Iran at 94.ప్ర‌పంచంలోనే అత్యంత మురికి వ్య‌క్తిగా పేరు గాంచిన అమౌ హాజీ ఇక లేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 2:54 AM GMT
బ‌ల‌వంతంగా స్నానం చేయించిన కొన్ని రోజుల‌కే.. ప్ర‌పంచంలోనే అత్యంత మురికి వ్య‌క్తి మృతి

ప్ర‌పంచంలోనే అత్యంత మురికి వ్య‌క్తి(డ‌ర్టీ మ్యాన్‌)గా పేరు గాంచిన అమౌ హాజీ ఇక లేడు. ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ.. అర‌వై ఏళ్లలో ఒక్క సారి కూడా స్నానం చేయ‌లేదు. అయితే.. ఇటీవ‌లే అత‌డికి స్నానం చేయించ‌గా ఆదివారం(అక్టోబ‌ర్ 23)న‌ మ‌ర‌ణించిన‌ట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అత‌డి వ‌య‌స్సు 94 సంవ‌త్స‌రాలు.

ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో అమౌ హాజీ నివ‌సించేవాడు. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఎవ‌రూ లేరు. పెళ్లి కూడా చేసుకోలేదు. దీంతో అత‌డికి గ్రామ‌స్తులే చిన్న నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆయ‌న‌కు స్నానం అంటే అస‌హ్యం అని, క‌నీసం స‌బ్బుతో ముఖం, కాళ్లు, చేతులు క‌డుక్కున్న దాఖ‌లాలు కూడా లేవ‌ట‌. శుభ్రం అనే పదం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాడు. అత‌డికి 20 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఏదో అనారోగ్యం వెంటాడింద‌ని, అందుకు ప‌రిశుభ్ర‌తే కార‌ణం అని గ్ర‌హించిన‌ట్లు ఓ సంద‌ర్భంలో చెప్పాడు. అప్ప‌టి నుంచి స్నానానికి దూరంగా ఉన్నాడు.

రోడ్డుపైన చ‌నిపోయిన మూగ‌జీవాల‌ను తినేవాడు. రోజుకు 5 లీట‌ర్ల నీటిని తాగేవాడు. ఆ నీటిని సైతం మురికిగా ఉన్న డ‌బ్బాలోనే నిల్వ చేసేవాడు. హ‌జీకి స్మోకింగ్ అంటే చాలా ఇష్టం. నాలుగైదు సిగ‌రెట్లనూ ఒకేసారి పీల్చేవాడు. పొగాకు కాకుండా.. జంతువుల మలాన్ని పీలుస్తాడు. బాగా ఎండిపోయిన మలాన్ని.. తుప్పు పట్టిన పైపులో వేసుకుని హజీ స్మోక్ చేస్తాడు. ఇంత అప‌రిశుభ్రంగా జీవిస్తున్నా కూడా అత‌డు ఎంతో ఆరోగ్యంగా జీవించ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసేది.

ఎక్కువ కాలం స్నానం చేయ‌ని వారిలో హాజీదే రికార్డు. గ‌తంలో అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఆరోగ్యంగా ఉండ‌డంతో శాస్త్ర‌వేత్త‌లే షాక్ తిన్నారు. 60 ఏళ్లు స్నానం చేయ‌క‌పోయిన‌ప్ప‌టికి అత‌డి శ‌రీరంలో ఎలాంటి ప‌రాన్న‌జీవులు, బ్యాక్టీరియాలు లేవ‌ట‌. ఇలాంటి జీవితం గ‌డుపుతున్న ఇత‌డిపై 2013లో ఓ డ్యాకుమెంట‌రీ కూడా వ‌చ్చింది. అయితే.. కొన్ని నెల‌ల క్రితం గ్రామ‌స్తులు అత‌డికి బ‌ల‌వంతంగా స్నానం చేయించారు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కే అత‌డు మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం.

Next Story