అతను 65 ఏళ్లుగా స్నానం చెయ్యడం లేదు.. ఎందుకో తెలుసా?

world's dirtiest man Amou Haji.. who has not bathed in 65 years. అతను 65 ఏళ్లుగా స్నానం చెయ్యడం లేదు.. ఎందుకో తెలుసా.

By Medi Samrat  Published on  20 Jan 2021 3:34 AM GMT
worlds dirtiest man Amou Haji

అంద‌రూ ప్రతి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ శుభ్రతను పాటిస్తుంటారు. ఆ విధంగా వీలుకానివారు క‌నీసం కొద్దోగొప్పో ఒంటిని శుభ్ర‌ప‌రుచుకుని బయటకు వెళ్లడం సర్వ సాధారణం. కానీ ఒక రెండు రోజులపాటు స్నానం చేయకపోతే మన శరీరం మనకే ఎంతో చిరాకుగా అనిపిస్తుంది. అలాంటిది రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, ఏకంగా 65 సంవత్సరాల పాటు స్నానం చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? 65 సంవత్సరాల పాటు స్నానం చేయకుండా ఉండడం అంటే ఊహకే అందని విషయమని చెప్పవచ్చు. ఆ విధంగా స్నానం చేయకుండా ఉండటం ద్వారా ఎన్నో రోగాల బారిన పడతారని భావిస్తారు. కానీ ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి మాత్రం 65 ఏళ్లకు పైగా స్నానం చేయకుండా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌ లోని దెజ్‌ అనే ప్రాంతానికి చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి 65 ఏళ్లకు పైగా స్నానం చేయకుండా ప్రపంచంలోని అత్యంత మురికి మనిషిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం అతని వయసు 83 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆ విధంగా అతను 65 సంవత్సరాల పాటు స్నానం చేయకుండా ఉండడానికి కారణం ఏమిటంటే...హాజీ 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు.దీనికి గల కారణం ప్రతి రోజూ స్నానం చేయడం వల్లే అని భావించి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్నానం చేయకుండా ఉన్నాడు.

హాజీ ఊరి బయట ఓ పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటాడు. గ్రామస్తులు అతనికి ప్రతి రోజు భోజనం పెడుతూ ఉంటారు.హాజీ ఎక్కువగా మాంసాన్ని ఇష్టపడతాడు. ఎంత ఇష్టమంటే చనిపోయి, కుళ్ళిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తినేస్తాడు. ఆ విధంగా 65 సంవత్సరాల పాటు స్నానం చేయకుండా తను ఎంతో అందంగా ఉన్నానని హాజీ మురిసిపోతూ ఉంటాడు.

ఈ విషయంపై హాజీ మాట్లాడుతూ ఎక్కువగా పంది మాంసం అంటే ఇష్టమని, ప్రతిరోజు ఐదు లీటర్ల నీటిని తాగుతానని చెప్పాడు. అంతేకాకుండా తనకు పొగతాగే అలవాటు కూడా ఉందని సిగరెట్ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలను చుట్టగా చేసుకుని తాగుతానని హాజీ తెలిపారు. 65 సంవత్సరాల పాటు స్నానం చేయకుండా ఉన్న హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం చూసి చుట్టుపక్క గ్రామాల ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఆశ్చర్య పడుతుంది. ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్న హాజీ ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డును సొంతం చేసుకున్నాడు.


Next Story