బాయ్‌ఫ్రెండ్ ఇంటిని తగలెట్టేసింది.. కాల్ చేస్తే మరో మహిళ ఎత్తిందని
Woman sets boyfriend’s house on fire after woman answered phone.ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌కు కాల్ చేసింది
By తోట వంశీ కుమార్
ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌కు కాల్ చేసింది. అయితే.. బాయ్‌ఫ్రెండ్‌కు బదులు మరో మహిళ ఆ ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకుంది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియురాలు బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించింది. అనంతరం అతడి ఇంటికి నిప్పుపెట్టింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది.
బెక్సర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 23 ఏళ్ల సెనైడా మేరీ సోటో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఫేస్‌టైమ్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌కి కాల్ చేసింది. అయితే.. ఆ కాల్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ కాకుండా మరో మహిళ ఎత్తింది. ఆ మహిళ అతడికి బంధువు అని తరువాత తెలిసింది.
మరో మహిళ కాల్ రిసీవ్ చేసుకోవడంతో ఆందోళన చెందిన సెనైడా వెంటనే తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. అతడి ఇంట్లోని అనేక విలువైన వస్తువులను దొంగిలించింది. ఆ తరువాత ఓ గదిలో ఉన్న మంచానికి నిప్పు అంటించింది. క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇళ్లు మంటల్లో తగలబడుతుండగా వీడియో కూడా తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే ఇంటిలోని వస్తువులతో పాటు ఇళ్లు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనలో $50,000 అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సెనైడా మేరీ సోటో కారణమని నిర్థారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.